పవన్ కల్యాణ్ దగ్గర ఓ అలవాటు ఉంది. ఎవరైనా దర్శకుడు వచ్చి కథ చెప్పి కన్వెన్స్ చేస్తే.. వెంటనే ఛాన్స్ ఇచ్చేస్తాడు. నిర్మాత టోకెన్ అడ్వాన్సుతో వస్తే.. నో చెప్పలేడు. ఎందుకంటే.. పవన్‌కి తన ఆర్థిక మూలాల్ని బలపరచుకోవడం చాలా ముఖ్యం. జనసేన పార్టీ కార్యక్రమాలు కొనసాగించాలంటే పవన్ కి డబ్బు చాల అవసరం. అందుకే.. ఎడా పెడా సినిమాల్ని ఒప్పుకుంటాడు. అక్కడి వరకూ ఓకే. కానీ.. ఆ సినిమాలన్నింటినీ పట్టాలెక్కించే సమయం పవన్‌కి లేదు. అందుకే సినిమాల్ని ఒప్పుకోవడం తప్ప... వాటిని పట్టాలెక్కించలేకపోతున్నాడు.
అలా.. మైత్రీ మూవీస్ సినిమా కూడా మూలన పడిపోయింది. పవన్‌కి మైత్రీ మూవీస్ అప్పుడెప్పుడో రూ.40 కోట్ల అడ్వాన్స్ ఇచ్చింది. హరీశ్ శంకర్‌ని దర్శకుడిగా బుక్ చేసింది. `భవదీయుడు భగత్ సింగ్` అనే టైటిల్ తో ఓ సినిమా మొదలెడతామని మైత్రీ ప్రకటించి చాలా కాలం అయ్యింది. అయితే ఆ సినిమా ఇప్పటి వరకూ సెట్స్‌పైకి వెళ్లలేదు. దానికి బోలెడని కారణాలున్నాయి. హరీశ్ కూడా ఈ సినిమా కోసం చాలా ఓపిగ్గా ఎదురు చూశాడు. ఇక లాభం లేదని మరో హీరోని వెదుక్కొనే పనిలో పడ్డాడు. మైత్రీ మూవీస్ కూడా పవన్ తో విసిగిపోయింది. ఇప్పుడు తన అడ్వాన్స్ తిరిగి ఇవ్వమని పవన్ పై ఒత్తిడి చేస్తోందని సమాచారం.
మైత్రీ మూవీస్ అడ్వాన్సుల విషయంలో చాలా పక్కాగా ఉంటుంది. తీసుకొన్న అడ్వాన్స్ ప్రకారం సినిమా చేయకపోతే... దాన్ని వడ్డీతో సహా వసూలు చేస్తుంది. ఆమధ్య త్రివిక్రమ్ విషయంలోనూ అదే జరిగింది. మైత్రీ మూవీస్ లో త్రివిక్రమ్ ఓ సినిమా చేయాలి. కానీ అది పట్టాలెక్కలేదు. దాంతో త్రివిక్రమ్ దగ్గర అడ్వాన్స్ ని వడ్డీతో సహా వెనకర్కి తీసుకొంది. ఇప్పుడు పవన్ దగ్గర కూడా అదే పంథా అనుసరించబోతోందని టాక్. అంటే.. ఈ నలభై కోట్లు పవన్ వడ్డీతో సహా చెల్లించాలన్నమాట. మరి పవన్ ఏం చేస్తాడో చూడాలి.