టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయకుల్లో పవన్ కల్యాణ్ ఒకరు. ఆయన సినిమా ఫ్లాపైనా.. మంచి వసూళ్లే అందుకుంటాయి. అందుకే ఎన్ని ఫ్లాపులొచ్చినా తన డిమాండ్ ఎప్పుడూ తగ్గలేదు. పారితోషికం పెరుగుతూనే వెళ్లింది. కానీ పవన్ సంపాదించిందేం లేదు. తనేం వ్యక్తిగతంగా ఆస్తులు కూడ బెట్టలేదు. ఈ విషయాన్ని చాలాసార్లు చెప్పారు. దానికి కారణమేంటో బుధవారం జరిగిన సమావేశంలో తన అభిమానుల సాక్షిగా చెప్పారు.
''మాదాపూర్‌లో ఎకరం లక్ష రూపాయలు ఉన్నప్పుడు నా సంపాదన కోటి రూపాయలు. కావాలంటే అప్పుడే కొనేసేవాడ్ని. ఇప్పుడు.. వేలాది కోట్లు నా దగ్గర ఉండేవి. వైకాపా నాయకుల కంటే ఎక్కువ డబ్బుని, నిజాయతీగా సంపాదించేవాడ్ని. కానీ అలా చేయలేదు. ఎందుకంటే డబ్బు సంపాదించే కొద్దీ భయం పెరిగిపోతుంది. నా ధైర్యం.. ధనం. ద్రవ్యం కాదు. అందుకే డబ్బు సంపాదన పై దృష్టి పెట్టలేదు. నా తొలి పారితోషికం కేవలం 5 వేలు మాత్రమే. జానీ సమయంలో నా పారితోషికాన్ని సైతం వెనక్కి ఇచ్చేయడమే కాదు. పదహారు లక్షలు అప్పు కూడా చేశా'' అని ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోయారు పవన్ కల్యాణ్.