అటు రాజకీయాలు, ఇటు సినిమా... ఇలా రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్నారు పవన్ కల్యాణ్. ప్రస్తుతం పవన్ ఉన్న పరిస్థితుల్లో ఇలా రెండూ కావాలనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే...ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది. చేతిలో సినిమాలున్నాయి. తన పార్టీని ఆర్థికంగా పరిపుష్టం చేయాలంటే డబ్బులు కావాలి. అందుకే సినిమాలు చేస్తున్నారు. ఈ విషయంలో ఎలాంటి ఆక్షేపణా లేదు. కాకపోతే... ఎప్పుడు సినిమా అంటారో...ఎప్పుడు పాలిటిక్స్ అంటారో తెలియని పరిస్థితి. అది నిర్మాతల్లో భయాందోళల్ని తీసుకొస్తోంది. పవన్ చేతిలో చాలా సినిమాలున్నాయి. హరి హర వీరమల్లు... ఎప్పుడో పూర్తికావాల్సింది. కానీ పవన్ డేట్లు కేటాయించలేకపోవడం వల్ల వాయిదా పడుతూ వస్తోంది. ఆ సినిమా షూటింగ్ ముందు నుంచీ నత్తనడక నడుస్తూనే ఉంది. మైత్రీ మూవీస్, దానయ్యల దగ్గర పవన్ అడ్వాన్సులు తీసుకొన్నారు. పవన్ కోసం హరీష్ శంకర్ చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. కానీ.. పవన్ నుంచి ఎలాంటి సిగ్నల్ అందడం లేదు.
ఇప్పుడు వవన్ బస్సు యాత్ర మొదలెట్టబోతున్నాడు. ఏపీ అంతా... బస్సులో తిరిగి, ప్రజల కష్టసుఖాల్ని తెలుసుకోబోతున్నాడు. అందుకోసం కాన్వాయ్ కూడా సిద్ధమైంది. యాత్ర అటూ ఇటూగా మూడు వారాలు అంటున్నా.. దాన్ని పొడిగించే ఛాన్స్ ఉంది. యాత్ర అయ్యాక.. సినిమాలకు రెడీ అవ్వడానికి కనీసం మరో మూడు వారాల సమయం పడుతుంది. అంటే రెండు నెలలు షూటింగులకు దూరం అన్నమాట. పవన్ కోసం ఎదురు చూస్తున్న నిర్మాతలకు ఇది షాకింగ్ వార్తే. మరీ ముఖ్యంగా హరి హర వీరమల్లు నిర్మిస్తున్న... ఏ.ఎం.రత్నంకి. ఆయన ఈ సినిమా కోసం చాలా అప్పులు చేశారని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఆ అప్పులకు వడ్డీ పెరుగుతూ పోతోంది. మరోవైపు పవన్ ఈ సినిమా షూటింగ్‌కు వాయిదాల మీద వాయిదాలు వేస్తూనే ఉన్నారు. ఈ కష్టాలు ఎప్పటికి తీరేనో..?!