భీమ్లా నాయక్ తో మరో విజయాన్ని అందుకున్నాడు పవన్ కల్యాణ్. 2022లో టాలీవుడ్ అందుకున్న భారీ విజయమిది. ఏపీలో ప్రతికూల పరిస్థితుల్లోనూ భీమ్లా రాణించాడు. అయితే.. పవన్ పై ఇప్పుడు విమర్శ బలంగా వినిపిస్తోంది. పవన్ రీమేక్ సినిమాలే నమ్ముకుంటున్నాడని, దాంతో కొత్త దర్శకులకు, కొత్త కథలకు అవకాశమే లేకుండా పోతోందని, పవన్‌కి భయాలెక్కువ అని... ఇలా రకరకాల కామెంట్లు.
నిజమే. పవన్ కెరీర్‌లో ఎక్కువగా రీమేకులే కనిపిస్తాయి. అవే తనకు హిట్లు అందించాయి కూడా. అయితే.. రీమేకులు చేస్తే తప్పేంటి? అనేది పవన్ అభిమానుల ప్రశ్న. రీమేక్స్ అనేవి పవన్ ఒక్కడే చేయడం లేదు. దాదాపు హీరోలంతా అదే చేస్తున్నారు. ఒక్క తెలుగులోనే ఈ సంప్రదాయం లేదు. అన్ని భాషల్లోనూ ఉంది. తెలుగులో సూపర్ హిట్ అవుతున్న సినిమాల్ని హిందీవాళ్లు రీమేకులు చేయడం లేదా? ఇక్కడ కథని వాళ్లు రీమేక్ చేస్తున్నారంటే అర్థం, అక్కడ ప్రతిభపై నమ్మకం లేదనా ?
పవన్ సినిమా అంటే దాదాపు వంద కోట్లకు పైమాటే. నిర్మాత అంత రిస్క్ తీసుకుంటున్నప్పుడు సేఫ్ గేమ్ ఆడడంలో తప్పు లేదు. పవన్ సూపర్ హిట్లయిన బద్రి, అత్తారింటికి దారేది, జల్సా.. ఇవి రీమేకులు కాదు కదా..? సొంత కథల్ని పవన్ ఎప్పుడూ వద్దనలేదు. కాకపోతే.. వాటి ఫలితాన్ని అంచనా వేయడం కష్టం. రీమేకులు ఎంచుకుంటే మినిమం గ్యారెంటీ ఉంటుంది. పవన్ అదే చేస్తున్నాడు.