ఈ మధ్య కథానాయకులు రూటు మార్చారు. పారితోషికం బదులుగా సినిమాలో వాటా అడుగుతున్నారు. మహేష్‌బాబు మొదలెట్టిన ఈ ట్రెండ్ ని పవన్ కల్యాణ్ ఫాలో అయిపోతున్నాడు. తాజాగా పవన్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఓ సినిమా మొదలైంది. హారిక హాసిని సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈసినిమా కోసం పవన్ పారితోషికంగా 30 శాతం వాటా అందుకోనున్నట్టు సమాచారం. ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగితే అంత.. అందులోంచి 30 శాతాన్ని పవన్‌కి పారితోషికంగా ఇస్తారన్నమాట. ఉదాహరణకు సినిమాకి రూ.100 కోట్ల బిజినెస్ జరిగితే, అందులో 33 కోట్లు పవన్‌కి పారితోషికంగా ఇవ్వాల్సిందే. కాటమరాయుడు సినిమాకి రూ.104 కోట్ల బిజినెస్ జరిగింది. ఇది త్రివిక్రమ్ సినిమా కాబట్టి కచ్చితంగా రూ.120 కోట్ల వరకూ బిజినెస్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ అంచనాలు నిజమైతే పవన్‌కి రూ.40 కోట్ల పారితోషికం అందుతుంది.