పవన్‌కళ్యాణ్‌ 'సత్యాగ్రహి' పట్టాలెక్కుతుందా?

By iQlikMovies - April 21, 2018 - 11:34 AM IST

మరిన్ని వార్తలు

చాలాకాలం క్రితం 'సత్యాగ్రహి' అనే సినిమాని అనౌన్స్‌ చేసేశారు. పవన్‌కళ్యాణ్‌ హీరోగా నటించాల్సిన సినిమా అది. కొన్ని కారణాలతో ఆ సినిమా ఆగిపోయింది. అయితే, ఆ టైటిల్‌తో సినిమా తెరకెక్కించాలని తాజాగా పవన్‌కళ్యాణ్‌ భావిస్తున్నాడట. 

తాజా రాజకీయ పరిణామాలు, సినీ పరిశ్రమలో చోటుచేసుకున్న వివాదాల నేపథ్యంలో 'సత్యాగ్రహి' సినిమాని పట్టాలెక్కించాలన్నది పవన్‌కళ్యాణ్‌ ఆలోచనగా కన్పిస్తోంది. కథ విషయంలో ఇప్పటికే పవన్‌కళ్యాణ్‌కి పూర్తి క్లారిటీ వుందనీ, 'అజ్ఞాతవాసి' తర్వాత ఈ సినిమానే చేయాలనుకున్నా, రాజకీయాల్లో బిజీ అవడంతో, పూర్తిగా టైమ్‌ రాజకీయాలకే కేటాయించాలనుకుని సినిమాలకు గుడ్‌ బై చెప్పడంతో 'సత్యాగ్రహి' అటకెక్కిందనీ అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. 

పవన్‌కళ్యాణ్‌ సన్నిహితుడు, ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, ఈ కథలో కొన్ని మార్పులు కూడా చేశారట. 2019 తర్వాత చేయాలనుకున్న 'సత్యాగ్రహి'ని వీలైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. అయితే దర్శకుడెవరన్నదానిపై స్పష్టత లేదు. అతి త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రాబోతోందని సమాచారమ్‌. 

అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో పవన్‌కళ్యాణ్‌ సినిమా చేయగలడా? అన్న అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే 2019 ఎన్నికలకు ఎంతో దూరం లేదు. పైగా, ఓ అనూహ్య వివాదం పవన్‌కళ్యాణ్‌ని ఇప్పుడు చాలా బిజీగా మార్చేసింది.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS