'అజ్ఞాతవాసి' ఆడియో రిలీజ్ ఫంక్షన్ నిన్న హైద్రాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇంతకు ముందెన్నడూ పవన్ కళ్యాణ్ సినిమా ఫంక్షన్స్ ఇంత గ్రాండ్‌గా జరగలేదు. మామూలుగా పవన్ సినిమాలకు సంబంధించి ఫంక్షన్స్ జరగడం చాలా అరుదు. అలాంటిది ఈ రేంజ్‌లో ఈ సినిమాకి ఆడియో ఫంక్షన్ ప్లాన్ చేశారు. ఈ ఆడియో ఫంక్షన్‌లో పవన్ మాట్లాడిన తీరు అభిమానుల్ని కట్టి పడేసింది.
సక్సెస్ ఫెయిల్యూర్స్‌లో ఎప్పుడూ తనకు తోడున్నది తన సన్నిహితులు, కుటుంబ సభ్యులు కాదు.. సినిమా పరిశ్రమకి సంబంధించి ఓ దర్శకుడిగా త్రివిక్రమ్ ఎప్పుడూ తన పక్కనే ఉండగా, అంతకు మించిన అభిమానంతో తన పక్కన ఉన్నది అభిమానులే అని పవన్ చెప్పిన మాటకు అభిమానులు బాగా కనెక్ట్ అయ్యారు. ప్రత్యక్షంగా అభిమానులను ఒక్కొక్కరినీ కలవలేకపోయినా కానీ ఎప్పుడూ తన మనసు అభిమానుల చుట్టూనే తిరుగుతూ ఉంటుందని పవన్ అన్నారు.
అంతేకాదు పవన్ స్టేజ్ మీద ఉండగా, ఓ అభిమాని అనూహ్యంగా స్టేజ్ పైకి రావడం, బౌన్సర్లు అతనిని పక్కకి లాగేయాలని ట్రై చేయడం.. సడెన్‌గా జరిగిపోయాయి. ఆ సందర్భంలో పవన్ వారిని వారించి, ఆ అభిమానిని ఆప్యాయంగా గుండెలకు హత్తుకుని, ఓ సెల్ఫీ తీసుకుని పంపించాడు. అదీ పవన్‌కి అభిమానులపై ఉన్న ప్రేమ. అభిమానుల నుండి పొందిన ఆ ప్రేమ, అభిమానమే తనకు ఎప్పుడూ తోడున్నాయని పవన్ అన్నారు.
ఎప్పుడో 'గోకులంలో సీత' టైంలో అసిస్టెంట్ రైటర్‌గా ఉన్న త్రివిక్రమ్ ఇప్పటికీ తనని వదిలి పెట్టకుండా, అన్నింట్లోనూ తోడుగా ఉన్నాడనీ స్నేహానికి మించిన చొరవ త్రివిక్రమ్ దగ్గరుందనీ తన కుటుంబ సభ్యుల వద్ద కూడా అలాంటి చొరవ లేదనీ పవన్ అన్నారు. అలాగే 'ఖుషీ' తర్వాత సినిమాలు మానేద్దామనుకున్న తనకు అభిమానుల ప్రేమ కారణంగానే ఇలా 25 చిత్రాలు చేయగలిగాననీ, అభిమానులు తనని ఎలాంటి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టలేదనీ అభిమానులనుద్దేశించి పవన్ ప్రసంగించిన తీరు అందర్నీ ఆకట్టుకుంది.