రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో దుమ్ము రేపాడు పవన్ కల్యాణ్. చిత్రసీమపై ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై నిప్పులు చెరిగాడు. `కావాలంటే నా సినిమాలు ఆపుకోండి.. మిగిలిన సినిమాల్ని వదిలేయండి` అని.. చురకలు అంటించాడు. ఆ స్పీచు పెద్ద సంచలనం. మంత్రులు కూడా పవన్ కామెంట్లకు వివరణ ఇచ్చుకోవాల్సివచ్చింది.
భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ లోనూ పవన్ స్పీచ్ ఇలానే ఉంటుందేమో అనుకున్నారంతా. కానీ.. పవన్ స్పీచ్ కేవలం సినిమాకే పరిమితమైంది. రాజకీయ పరమైన కామెంట్లేం చేయలేదు. టికెట్ రేట్ల గురించి కూడా ఆయనేం ప్రస్తావించలేదు. దాంతో.. పవన్ తగ్గాడా? అంటూ.. కామెంట్లు మొదలయ్యాయి. పవన్ ఏం మాట్లాడినా, దాన్ని రాజకీయం చేయాలని వైకాపా నేతలు భావిస్తోంది. ఏపీలో చిత్రసీమకూ, ప్రభుత్వానికీ గ్యాప్ తగ్గుతున్న వేళ, టికెట్ రేట్లు మళ్లీ పెంచుతారన్న ఆశలు చిగురిస్తున్న వేళ, పవన్ ఏదేదో మాట్లాడితే అది ప్రమాదమే. వ్యవహారం మళ్లీ మొదటికి వస్తుంది. అందుకే ఈసారి పవన్ సైలెంట్ అయిపోయాడని టాక్. తాను సినిమా పరిశ్రమ క్షేమం కోసమే మాట్లాడినా, రిపబ్లిక్ స్పీచ్ తరవాత, ఎవరూ పవన్ కి అనుకూలంగా మాట్లాడలేదు. పైగా పవన్ వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదని లేఖలు విడుదల చేశారు. దాంతో పవన్ హర్టయ్యాడు. అందుకే ఈసారి పవన్ ఏం మాట్లాడలేదని తెలుస్తోంది.