జనసేన ప్రారంభించాక సినిమాలకు గుడ్ బై చెప్పాడు పవన్ కల్యాణ్. కానీ ఆ తరవాత మనసు మార్చుకుని - సినిమాలు మొదలెట్టాడు. ఇప్పుడు పవన్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. తన చేతిలో 4 సినిమాలున్నాయి. అయితే... ఇవన్నీ పూర్తయ్యాక పవన్ మళ్లీ సినిమాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్పేయనున్నాడని టాక్. దానికి రెండు కారణాలున్నాయి. ఒకటి.. 2024 ఎన్నికల కోసం పవన్ సిద్ధమవ్వాలి. ఈసారి ఎన్నికలలో జనసేనకు కొన్ని ఎం.ఎల్.ఏ సీట్లు రావడం ఖాయంగా కనిపిస్తోంది. అంటే.. రాజకీయంగా పవన్ బలపడబోతున్నాడన్నమాట. అప్పుడు కూడా పార్ట్ టైమ్ రాజకీయాలు చేస్తానంటే కుదరదు. అందుకే సినిమాల్ని వదులుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. మరోవైపు.. పవన్ తో సినిమా అంటే ఇప్పుడు నిర్మాతలు భయపడుతున్నారు. ఎందుకంటే ఏపీ ప్రభుత్వంతో పవన్ కి చాలా గొడవలున్నాయి.
పవన్ ని అడ్డుకోలేకపోతే, కనీసం పవన్ సినిమాలైనా అడ్డుకుని సంతృప్తి పడిపోదాం అనుకుంటోంది అక్కడి ప్రభుత్వం. పవన్ తో సినిమా అంటే... నిర్మాతలకు లేని పోని తలనొప్పులు చాలా వస్తాయి.కాబట్టి.. ఇప్పుడు వాళ్లంతా సైడ్ అయిపోవొచ్చు. మరోవైపు... ఇటీవల రిపబ్లిక్ ఫంక్షన్ లోపవన్ మాట్లాడిన మాటలు సంచలనం రేపాయి. చిత్రసీమ తరపున పవన్ మాట్లాడినా, తనకు టాలీవుడ్ నుంచి ఎలాంటి మద్దతు లభించలేదు. సరికదా.. మాకూ, పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకూ ఎలాంటి సంబంధం లేదు అని తేల్చేశారు. అంటే.. పవన్ ఒక్కడూ ఒకవైపు, ఇండ్రస్ట్రీ మరోవైపు ఉన్నాయన్నమాట. అందుకే పవన్ ఈ సినిమాలపై, ఇక్కడి మనుషులు, రాజకీయాలపై ఏవగింపుతో ఉన్నాడని టాక్. అందుకే చేతిలో ఉన్న సినిమాల్ని పూర్తి చేసి, సినిమాలకు దూరమైపోవాలనుకుంటున్నాడట.