ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే 60 రోజులు డేటేసింది. ఎన్నికల్లో ఓటమి చవి చూసి ప్రతిపక్ష హోదా పొందిన టి.డి.పి నేతలకు, అధికార పక్షం లో ఉన్న వైసిపి నేతలకు మధ్య పోటాపోటీగా అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఎన్నికల్లో అనుకోని విధంగా ఘోర పరాజయం పాలైన జనసేన పార్టీ అధినేత 'పవన్ కళ్యాణ్' మాత్రం ఈ మధ్యే బయటికి వచ్చి పార్లమెంటరీ సమావేశాలు, ఆత్మీయ సభలు అంటూ జనసైనికులను.. జనసేన నేతలను కలవడం మొదలు పెట్టారు. ఈ సమావేశాల్లో ప్రసంగిస్తూ...ఎన్నికల వైఫల్యం గురించి, దానికి గల కారణాల గురించి మాట్లాడుతూ జనసైనికులకు ధైర్యం చేకూర్చే ప్రయత్నం చేసాడు పవన్.
ఇందులో భాగంగా పాలకొల్లు, తణుకు మరియు ఆచంట నియోజకవర్గ సమావేశంలో ఆసక్తికరమైన విషయం ఒకటి చెప్పాడు పవన్. నర్సాపురం సభలో తన చేతి వాచ్చిని ఎవరో ఒక అభిమాని కొట్టేశాడట. అవును...తన వాచ్చిని చూపిస్తూ పవనే స్వయంగా చెప్పాడు. 'నాకు ఈ వాచ్చిలు పెట్టుకోవడం పెద్దగా ఇష్టం లేదు.. అందుకే ఇందాక నర్సాపురం సభ దగ్గర చేతులు కడుక్కుందామని పక్కన పెట్టి మర్చిపోయాను.. తరువాత గుర్తుకు వచ్చి వెతికించినా దొరకలేదు. కానీ అది తీసుకున్న అభిమాని కొంతసేపటికి భాధ పడి మళ్ళీ నా మనుషులకు తిరిగి ఇచ్చేశాడు. తాను బయటికి రాలేనని, తన క్షమాపణలు చెప్పమని చెప్పాడట' దానికి పవన్ ఇంప్రెస్ అయ్యి, ఆ అభిమానిని పర్సనల్ గా కలిసి థాంక్స్ చెప్తాను అని చెప్పాడు.
'నేను ఏది దోచుకోలేదు కాబట్టి నాది దొంగిలించినా తిరిగి ఇచ్చేసాడు ఆ కుర్రాడు.. అదే నేను వేల కోట్లు దోచుకుంటే మళ్ళీ నా వస్తువు నాకు ఇచ్చేవాడా.. ఇదే నేను చెప్పే మార్పు' అని అన్నాడు పవన్.