బాహుబలి తరవాత పాన్ ఇండియా సినిమాలపై యావ పెరిగింది. అన్ని భాషల్లో సినిమాని విడుదల చేస్తే డబ్బులు గిట్టుబాటు అవుతాయని దర్శక నిర్మాతలు గట్టిగా నమ్మడం మొదలెట్టారు. కేజీఎఫ్ లాంటి చిత్రాలు సైతం బాలీవుడ్‌లో దుమ్ము రేపాయి. దాంతో.. ఆ నమ్మకం మరింత బలపడింది. సైరాని సైతం బాలీవుడ్‌ని టార్గెట్‌గా చేసి విడుదల చేశాడు చిరంజీవి. కేవలం బాలీవుడ్ ప్రేక్షకుల కోసమే అమితాబ్ బచ్చన్‌ని రంగంలోకి దింపాడు.
అయితే ఆ ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. సైరా తెలుగులో విజయం సాధించింది గానీ, మిగిలిన భాషల్లో తేలిపోయింది. ముఖ్యంగా బాలీవుడ్‌లో డిజాస్టర్ అయ్యింది. ఈ నేపథ్యంలో.. కొన్ని సినిమాలు జాగ్రత్త పడ్డాయి. బాలీవుడ్ లోనూ సినిమా విడుదల చేయాలన్న ఆలోచనని పక్కన పెట్టాయి. అయితే.. సరిగ్గా ఇలాంటి పరిస్థితుల్లోనే పవన్ కల్యాణ్ బాలీవుడ్‌లో అడుగుపెట్టబోతున్నాడు. క్రిష్ దర్శకత్వంలో పవన్ ఓ సినిమా చేస్తున్నాడు. ఇదో జానపద తరహా చిత్రం. ఈ సినిమాని పాన్ ఇండియా ఇమేజ్ తో రిలీజ్ చేయబోతున్నాడు. అయితే.. సైరా ఎఫెక్ట్ ఈ సినిమాపై పడినట్టు తెలుస్తోంది. సైరా రిజల్ట్ ని దృష్టిలో ఉంచుకున్న పవన్.. ఈ సినిమాని హిందీలో విడుదల చేయకూడదని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మిగిలిన దక్షిణాది భాషల్లో విడుదల చేస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని దర్శక నిర్మాతలకు సూచించాడట. బాలీవుడ్‌లో సినిమా రిలీజ్ చేసి, అక్కడ ఫెయిల్ అయితే... పరువు పోతుందని పవన్ భావిస్తున్నాడని టాక్. సో.. క్రిష్ సినిమా బాలీవుడ్‌కి వెళ్లకపోవొచ్చు.