సీక్వెల్స్ ఆపేసి చాప్టర్స్ మొదలెట్టారు దర్శకులు. ఓ కథని రెండు భాగాలుగా విడగొట్టి, చాప్టర్ 1, చాప్టర్ 2లుగా చెబుతున్నారు. ఇదో సక్సెస్ ఫార్ములా అయ్యింది. బాహుబలి, పుష్ప, కేజీఎఫ్ ఇవన్నీ ఇదే ఫార్ములా అనుసరించాయి. ఇప్పుడు ఓజీ సైతం పార్ట్ 1, పార్ట్ 2లుగా రాబోతోందని టాక్. పవన్ కల్యాణ్ - సుజిత్ కాంబోలో రూపుదిద్దుకొంటున్న సినిమా ఇది. ఇమ్రాన్ హష్మీ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తయింది. పవన్ కల్యాణ్ మరో 15 రోజులు ఇస్తే చాలు. మిగిలిన పార్ట్ లాగించేస్తారు. ఈ యేడాది చివరి నాటికి ఓజీ విడుదలకు రెడీగా ఉంటుంది.
అయితే ఓజీలో మొత్తం కథ చెప్పడం లేదు. సగం కథ దాచి, పార్ట్ 2గా కూడా చూపించాలని ప్రణాళికలు సిద్దం చేస్తున్నారని తెలుస్తోంది. తొలి భాగంలో పవన్ స్క్రీన్ ప్రెజెన్స్ 45 నిమిషాల పాటు ఉంటుందని టాక్. ఇంట్రవెల్ వరకూ పవన్ 2,3 సన్నివేశాల్లోనే కనిపిస్తాడట. సెకండాఫ్ మొత్తం ఉంటాడు. అయితే పవన్ సీన్ లో ఉన్నా, లేకున్నా.. పవన్ ఉన్న ఇంపాక్ట్ మాత్రం తెలుస్తూనే ఉంటుంది. ఇది `విక్రమ్` తరహా స్క్రీన్ ప్లే. అందులోనూ అంతే. కమల్ తొలి సగంలో చాలా తక్కువ సన్నివేశాల్లోనే కనిపిస్తాడు. ద్వితీయార్థంలో మాత్రం కమల్ పైనే సినిమా రన్ అవుతుంది. `ఓజీ` కూడా అదే ఫార్మెట్ లో వెళ్లబోతోందని టాక్.