జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో పవన్ ప్రసంగించనున్నారు. ఈ యూనివర్సిటీలో ప్రసంగించే అవకాశం రావడమే చాలా అరుదు. ఇలాంటి అరుదైన అవకాశం పవన్‌కి దక్కింది. ఐదు రోజుల పాటు పవన్ అక్కడ పర్యటించనున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫిసర్ స్టీవెన్ జార్జింగ్‌తో దాదాపు రెండు గంటల పాటు పవన్ ముచ్చటించినట్లు జనసేన పార్టీ సోషల్ మీడియా ద్వారా తెలిపింది. ఆయనతో పవన్ కలిసి ఉన్న ఫోటోలను కూడా ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ రోజు మద్యాహ్నం 12 గంటల నుండి 2 గంటల వరకూ అమెరికా కాంగ్రెస్ సభ్యులు, సెనేటర్లు, అమెరికా న్యూక్టియర్ పాలసీ రూపకర్తలతో రౌండ్ టేబుల్ సమావేశంలో పవన్ పాల్గొంటారనీ జనసేన పార్టీ ప్రకటించింది. సాయంత్రం 4 గంటలకు నషువాలోని రివర్ యూనివర్సిటీ దగ్గర ఎన్నారైలు నిర్వహిస్తోన్న కార్ ర్యాలీలో పవన్ పాల్గొంటారు. ఈ తర్వాత డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలకు చెందిన సెనేటర్లు, నషువా మేయర్స్, ఎన్నారైలనుద్దేశించి పవన్ ప్రసంగిస్తారు అనే విషయాన్ని కూడా జనసేన పార్టీ తన ప్రకటనలో పేర్కొంది. మరో పక్క పవన్ నటిస్తోన్న 'కాటమరాయుడు' సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. ఈ ఐదు రోజుల అమెరికా పర్యటన ముగించుకుని పవన్ తిరిగి షూటింగ్‌లో పాల్గొననున్నారట.