తెలుగులో మంచు మనోజ్ హీరోగా రూపొందిన ‘ప్రయాణం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ పాయల్ ఘోష్, ఆ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘ఊసరవెల్లి’ సినిమాలో హీరోయిన్ తమన్నా స్నేహితురాలి పాత్రలో కన్పించిన విషయం విదితమే. ఆ తర్వాత పెద్దగా తెలుగు తెరపై ఈ బ్యూటీ కన్పించలేదు. ఈ మధ్యనే సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోలతో మళ్ళీ తన పాపులారిటీ పెంచుకుంటోన్న పాయల్ ఘోష్‌కి అనూహ్యంగా కరోనా వైరస్ కోలుకోలేని దెబ్బ తీసిందట.
అయితే, ఆమెకు కరోనా వైరస్ సోకలేదు. కానీ, కరోనా వైరస్ కారణంగా ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్ పరిస్థితులతో ఆర్థికంగా చితికిపోయానంటూ సోషల్ మీడియాలో తన ఆవేదన వెల్లగక్కింది. ‘నేను ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో వున్నాను. నేనే కాదు, చాలామందిది ఇదే పరిస్థితి. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతే, అందుబాటులో డబ్బుల్లేకపోతే ఆ పరిస్థితి చాలా దారుణంగా వుంటుంది’ అని పెద్ద ఆత్మకథ రాసుకొచ్చింది సోషల్ మీడియాలో పాయల్ ఘోష్. అలాగని ఆమె లాక్‌డౌన్‌ని వ్యతిరేకించలేదు.
దేశంలో చాలామంది ఇలాంటి ఆందోళనతోనే వున్నారనీ, వారందర్నీ ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై వుందనీ, అదే సమయంలో ప్రస్తుత విపత్తు పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ప్రభుత్వానికి అండగా వుండాలనీ, ప్రభుత్వాలు చెప్పినట్లు నడుచుకోవడం తప్ప వేరే మార్గం లేదని పేర్కొంది పాయల్ ఘోష్. కొద్ది రోజులకే ఆర్థిక ఇబ్బందుల్లో పాయల్ ఘోష్ కూరుకుపోయిందంటే నమ్మలేని విషయమే ఇది.