'ఆర్ఎక్స్ 100' సినిమాలో బోల్డ్ క్యారెక్టర్లో కనిపించి, కుర్రకారు మనసుల్ని కొల్లగొట్టేసిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్. 'వెంకీ మామ' వంటి సినిమాలో హోమ్లీ రోల్ పోషించినా, ఆమెకు ఆ బోల్డ్ ఇమేజ్ మాత్రం పోవడం లేదు. అయితే, వాస్తవానికి బోల్డ్ ఇమేజ్‌ని హీరోయిన్లు ఓ పట్టాన ఒప్పుకోరు. కానీ, పాయల్ మాత్రం అందుకు భిన్నం. ఆ ఇమేజే తనకు అంత క్రేజ్ తెచ్చిపెట్టిందంటోంది. ఆ క్రేజ్ కోరుకుంటే వచ్చేది కాదనీ, సో ఆ ఇమేజ్‌ని తాను చెరిపేయాలనుకోవడం లేదనీ, ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నాననీ చెబుతోంది.
లేటెస్ట్గా పాయల్ 'డిస్కోరాజా' సినిమాలో నటించింది. మొదట్నుంచీ పాయల్ పాత్రను సస్పెన్స్‌గానే ఉంచారు. సినిమా రిలీజయ్యాక ఆ పాత్రను ఎందుకు సస్పెన్స్‌గా ఉంచారో అర్ధమైంది. 80ల కాలంలో ఓ మూగ అమ్మాయి పాత్రలో పాయల్ నటించింది. చాలా తక్కువ నిడివి ఉన్న పాత్ర ఇది. కానీ, పాయల్ ఆ పాత్రకు తన శక్తికి మేర న్యాయం చేసింది. అయితే సినిమా రిజల్ట్ విషయంలో ఇంకా సరైన క్లారిటీ రాలేదనుకోండి. ఆ విషయం పక్కన పెడితే, ప్రస్తుతం పాయల్ ఓ హీరోయిన్ ప్రాధాన్యత ఉన్న సినిమాలో నటిస్తోంది. స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్స్ కొట్టేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అమ్మడి ప్రయత్నాలు ఫలించాలని ఆశిద్దాం.