ఆర్.ఎక్స్ 100తో యువ హృదయాల్లో అందమైన చిచ్చు పెట్టింది పాయల్ రాజ్ పుత్. ఆ తరవాత... ఆమెకు అవకాశాలు పెద్ద ఎత్తునే వచ్చాయి. కానీ... అవేం తన కెరీర్ని నిలబెట్టలేకపోయాయి. ప్రత్యేక గీతాలు, లేడీ ఓరియోంటెడ్ సినిమాలు చేసినా ప్రయోజనం లేకపోయింది. ఇప్పుడు మళ్లీ ఆర్.ఎక్స్ 100 లాంటి విజయం కోసం ఎదురు చూస్తోంది. తనకొచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవాలని, తనలోని ప్రతిభని పూర్తి స్థాయిలో బయటకు తీయాలని ఆరాటపడుతోంది. ప్రస్తుతం `నరేంద్ర`లో నటిస్తోంది. జయంత్ సి.పరాన్జీ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా కోసం తొలి సారి తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది పాయల్. ''నా డబ్బింగ్ నేనే చెప్పుకోవాలన్నది నా కల. అది ఈ సినిమాతో నెరవేరింది'' అని మురిసిపోతోంది పాయల్. ఈమధ్య తెలుగు నాట అడుగుపెడుతున్న కథానాయికలంతా.. తెలుగు నేర్చుకుని, తెలుగులోనే మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ జాబితాలో పాయల్ కూడా చేరిపోయిందన్నమాట. మరో రెండు మూడు సినిమాలైతే.. తెలుగులో పాటలు కూడా పాడేస్తుందేమో..?