పెద్ది.. రామ్ చరణ్ నుంచి ఫ్యాన్స్ కోరుకునేది ఇదే..!

మరిన్ని వార్తలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరుకుంది. ‘గేమ్ ఛేంజర్’ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో, రామ్ చరణ్ ఫ్యాన్స్ అతని తదుపరి చిత్రమైన ‘ఆర్సీ 16’ పై అంచనాలు అమాంతం పెంచుకున్నారు. దర్శకుడు బుచ్చిబాబు రూపొందిస్తున్న ఈ చిత్రం గురించి రోజుకో అప్‌డేట్ వస్తుండటంతో హైప్‌ మరింత పెరుగుతోంది. తాజాగా, ఉగాది కానుకగా టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ విడుదల చేశారు. ముందుగా ప్రచారం జరిగినట్టుగానే ‘పెద్ది’ అనే పవర్‌ఫుల్ టైటిల్ ఫిక్స్ అయింది. టైటిల్‌తో పాటు విడుదల చేసిన రెండు స్టిల్స్‌ అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మాస్ లుక్‌లో చేతిలో చుట్ట పట్టుకుని రౌద్రంగా చూస్తున్న రామ్ చరణ్ ఫోటో అభిమానుల్లో ఉత్సాహం నింపింది. మరో స్టిల్‌లో రఫ్ లుక్‌లో క్రికెట్ బ్యాట్ పట్టుకుని కనిపించడం సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.

‘గేమ్ ఛేంజర్’లో చరణ్ పాత్ర చాలా సాఫ్ట్‌గా ఉండటంతో ఫ్యాన్స్‌కు పెద్దగా కనెక్ట్ కాలేదు. అయితే ‘పెద్ది’ విషయంలో అలాంటి సందేహాలకు అవకాశమే లేదు. సుకుమార్ శిష్యుడిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్‌ను ఏర్పాటు చేసుకున్న బుచ్చిబాబు, ఈసారి ఊహించని మాస్ ఎలిమెంట్స్‌తో ముందుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే, ముందుగా టీజర్‌ను చరణ్ బర్త్ డే కానుకగా టైటిల్ తో పాటు విడుదల చేయాలని అనుకున్నప్పటికీ, ఫైనల్ మిక్సింగ్ ఆలస్యమవడంతో ఉగాది రోజున అంటే మార్చి 30న రాబోతోంది. ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ పనుల్లో ఉన్నారు. అభిమానులకు టీజర్ రూపంలో అసలైన పండుగ అందించేందుకు చిత్ర బృందం సిద్దమవుతోంది.

ఇప్పటి వరకు విడుదల తేదీపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ, 2026 మార్చి 26న ‘పెద్ది’ థియేటర్లలో సందడి చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. అదే రోజున నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అయినా సరే, మైత్రి మూవీ మేకర్స్ ఈ డేట్‌నే ఫైనల్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా, శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. జగపతి బాబు, దివ్యేందు, ఇతర ప్రధాన తారాగణంతో పాటు ఏఆర్ రెహమాన్ అందించే సంగీతం సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది. బర్త్‌డే సందర్భంగా చరణ్ అందించిన ఈ మాస్ ట్రీట్ అభిమానులను సంబరాల్లో ముంచెత్తుతోంది!


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS