భారీ బడ్జెట్ సినిమాలు, స్టార్ హీరో సినిమాలనే లెక్కల్లోకి తీసుకుంటుంటారు.ఆ లెక్కలు కూడా 100 కోట్ల బడ్జెట్‌కెక్కిన సినిమాలనే లెక్క చేస్తుంటాం. కానీ బడ్జెట్ పరంగానూ, బిజినెస్ పరంగానూ ఆ సినిమాలు ఒకవేళ ఫెయిలైతే తెచ్చి పెట్టే నష్టం అంతా ఇంతా కాదు. ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఇలా ఆ సినిమాపై ఆధారపడిని వారంతా దారుణంగా నష్టపోతారు. అలాంటి సినిమాల వల్ల ఇండస్ట్రీకి తీరని నష్టం జరుగుతోంది. కానీ ఒక చిన్న సినిమా బాగుంది అంటేనే కలెక్షన్ల వర్షం కురుస్తుంది. ఇక హిట్ టాక్ వచ్చిందంటే కాసుల పంటే. చిన్న సినిమాలకు బడ్జెట్ కూడా చాలా లిమిటెడ్‌గా వుంటుంది. దాంతో ప్రొడ్యూసర్లు లాభ పడడమే కాకుండా, ఇండస్ట్రీ కూడా కళకళలాడుతుంది. కానీ చిన్న సినిమాల పట్ల చిన్న చూపు ఇప్పటికీ అలానే ఉంది. చిన్న సినిమాలకి కేటాయించిన ధియేటర్లు చాలా తక్కువ. ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులను అధిగమించి, చిన్న సినిమాలను ప్రోత్సహిస్తే, ఇండస్ట్రీ బావుంటుంది. ఒక్క పెద్ద సినిమా తెచ్చి పెట్టే భారీ నష్టాన్ని రెండు మూడు చిన్న సినిమాలు ఈజీగా కవర్ చేసేస్తాయి. అలాంటి వాటిలో 'పెళ్లి చూపులు' సినిమా ఇండస్ట్రీకి లాభాల పంట తెచ్చి పెట్టిన సినిమాగా అభివర్ణించవచ్చు. అలాగే తాజాగా మెగా ప్రిన్స్ నటించిన 'ఫిదా' సినిమాకి ఇండస్ట్రీ మొత్తం ఫిదా అయిపోతోంది. ఈ సినిమా హిట్ అవడంతో బాక్సాఫీస్‌కి కాసుల పంట పండుతోంది. ఇలాంటి తరహాలో చాలానే చిన్న సినిమాలున్నాయి. అందుకే చిన్న సినిమాలను ప్రోత్సహిద్దాం. పెద్ద సంఖ్యలో లాభపడదాం అని ఇండస్ట్రీ అనుకుంటే, వారి ఆలోచనకు ఆడియన్స్ ఎప్పుడూ తోడుంటారు. చిన్న సినిమాల విడుదలకు ఏ రకమైన అడ్డంకులు లేకుండా చూడాలి. వాటి కోసం కేటాయించిన ధియేటర్ల సంఖ్య కూడా పెంచాలి.