64వ జాతీయ అవార్డుల ప్రకటితమయ్యాయి. ఇందులో ఉత్తమ తెలుగు చిత్రంగా 'పెళ్ళిచూపులు' చిత్రానికి జాతీయ అవార్డుని ప్రకటించారు. ఇదే చిత్రానికి మరో అవార్డు కూడా ప్రకటితమయ్యింది. ఉత్తమ మాటల రచయిత (తెలుగు) కేటగిరీలో 'పెళ్లిచూపులు' సినిమాకిగాను తరుణ్ భాస్కర్ పురస్కారాన్ని గెలుచుకున్నారు. అలాగే, మరో తెలుగు సినిమాకీ జాతీయ అవార్డ్ లభించింది. అదే 'జనతా గ్యారేజ్'. ఈ చిత్రానికిగాను బెస్ట్ కొరియోగ్రీఫీ విభాగంలో డాన్స్ మాస్టర్ రాజుసుందరంకి పురస్కారం ప్రకటించారు. అందాల భామ తాప్సీ నటించిన పింక్ చిత్రానికి కూడా జాతీయ అవార్డు లభించింది. ఉత్తమ సామాజిక చిత్రం కేటగిరీలో 'పింక్' ఈ పురస్కారాన్ని గెలుచుకుంది. 'పెళ్ళిచూపులు' విషయానికి వస్తే చిన్న చిత్రాల్లో చాలా చాలా పెద్ద విజయాన్ని అందుకుంది. విమర్శకుల ప్రశంసలతోపాటు ప్రేక్షకుల మన్ననలు పొంది, బాక్సాఫీస్ వద్ద కాసుల పంట పండించిందనడం నిస్సందేహం. యూత్ ఫుల్ లవ్ స్టోరీ మాత్రమే కాదు, ఫ్యామిలీని అలరించే మంచి కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ సినిమానే హీరో విజయ్ దేవరకొండకీ, హీరోయిన్ రీతూ వర్మకి స్టార్ డమ్ ఇచ్చింది. ఏదేమైనా తెలుగు చిత్రాలు జాతీయ పురస్కారాల కేటగిరీలో సత్తా చాటడం అభినందనీయం.