నటీనటులు : కీర్తి సురేష్, లింగా, మాస్టర్ అద్వైత్ తదితరులు
దర్శకత్వం : ఈశ్వర్ కార్తీక్
నిర్మాతలు : కార్తీక్ సుబ్బరాజ్
సంగీతం : సంతోష్ నారాయణ్
సినిమాటోగ్రఫర్ : కార్తీక్ పాలని
ఎడిటర్: అనిల్ క్రిష్
రేటింగ్: 2.5/5
ప్రతీ శుక్రవారం ఏదో ఓ కొత్త సినిమా థియేటర్లలో సందడి చేసేది. బాక్సాఫీసు కళకళలాడేది. కానీ లాక్ డౌన్ పుణ్యమా అని.. ఆ వినోదానికి కత్తెర పడింది. ఇప్పుడంతా ఓటీటీ హవానే. అదే సినిమా థియేటర్లు లేని లోటు తీరుస్తోంది. థియేటర్లలో విడుదల కాని సినిమాలన్నీ ఓటీటీ బాట పడుతున్నాయి.
ఈ రకంగా.. ఇంట్లోని లాప్ టాప్‌లూ, కంప్యూటర్ సిస్టమ్సే.. థియేటర్లుగా మారాయి. హోం థియేటర్లో విడుదలైన మరో సినిమా పెంగ్విన్. మహానటితో జాతీయ ఉత్తమ నటిగా ఎదిగిన కీర్తి సురేష్ నటించిన సినిమా అవ్వడంతో `పెంగ్విన్`పై ఆసక్తి, అంచనాలు పెరిగాయి. సోలో హీరోయిన్‌గా తొలిసారి థ్రిల్లర్ కథా చిత్రంలో నటించింది కీర్తి. మరి ఈ ప్రయత్నం ఎలా సాగింది? `పెంగ్విన్` ఎలా వుంది?
* కథ
రిథమ్ (కీర్తి సురేష్) ముద్దుల కొడుకు అజయ్ (అద్వైత్). ఓరోజు సడన్‌గా కనిపించకుండా పోతాడు. చార్లీ చాప్లిన్ ఆకారం ఉన్న ఓ వ్యక్తి అజయ్‌ని తీసుకెళ్లాడని ఓ పాప చెబుతుంది. అందకు మించిన ఆధారాలేం దొరకవు. అజయ్ వస్తువులు, స్కూల్ బ్యాగ్ ఓ చెరువు పక్కన దొరుకుతాయి. అప్పటి నుంచీ అజయ్ గురించి అన్వేషణ మొదలవుతుంది. ఆరేళ్లయినా ఆచూకీ దొరకదు. ఈలోగా రిథమ్ జీవితంలో చాలా మార్పులొస్తాయి.
రిథమ్ అశ్రద్ధ వల్లే.. అజయ్ కనిపించకుండా పోయాడన్న కోపంతో రఘు (లింగ) రిథమ్ కి విడాకులు ఇచ్చేస్తుంది. దాంతో రిథమ్ గౌతమ్ (రంగరాజ్)ని పెళ్లి చేసుకుని గర్భం దాలుస్తుంది. అయినా సరే... అజయ్ గురించి వెదుకుతూనే ఉంటుంది. ఓసారి హఠాత్తుగా అజయ్ దొరికేస్తాడు. కానీ.. తన ప్రవర్తనలో అనూహ్యమైన మార్పు. ఎవరినీ గుర్తించడు. పల్లెత్తు మాట మాట్లాడడు. గౌతమ్ దొరికేడాన్న ఆనందంలో ఉన్న రిథమ్‌కి మరో సమస్య. గౌతమ్‌ని ఎత్తుకెళ్లడానికి మళ్లీ ఆ అగంతకుడు వస్తూనే ఉంటాడు. అతన్నుంచి తన బిడ్డని రిథమ్ ఎలా కాపాడుకుంది? అసలు గౌతమ్ ని ఎత్తుకెళ్లింది ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానమే.. `పెంగ్విన్`.
* విశ్లేషణ
ఇదో సైకో థ్రిల్లర్. పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయే సైకో. ఓ బిడ్డని కోల్పోయిన తల్లి మధ్య జరిగే పోరాటం. సైకో బారీ నుంచి తన బిడ్డని ఎలా కాపాడుకుంది? అని చెప్పే ప్రయత్నం. థ్రిల్లర్ సినిమాలకు చిన్న థ్రెడ్ చాలు. అది `పెంగ్విన్`లో ఉంది కూడా. సైకో అజయ్‌ని ఎందుకు ఎత్తుకెళ్లాడు? ఎత్తుకెళ్లి ఏం చేశాడు? అసలు ఆ సైకో ఎవరు? అన్నవి ఈ సినిమాలోని చిక్కుముడులు. వాటిని సమర్థంగా విప్పితే... `పెంగ్విన్` ప్రయత్నం ఫలించేది. కానీ.. అరకొర ట్విస్టులు, వాటిని సాల్వ్ చేసిన విధానం కూడా అంతంత మాత్రంగానే ఉండడంతో `పెంగ్విన్` ఓ వృథా ప్రయత్నంగానే మిగిలిపోతుంది.
కథని చాలా నెమ్మదిగా మొదలెట్టాడు దర్శకుడు. థ్రిల్లర్ కథల లక్షణం అదే. సినిమా స్లోగా మొదలై.. సీన్ సీన్‌కీ స్పీడు పెరుగుతూ.. క్లైమాక్స్‌కి ఓ భారీ జర్క్ రావాలి. కానీ `పెంగ్విన్`లో అదే కనిపించదు. ఎంత స్లోగా మొదలైందో.. అంతే స్లోగా సాగుతుంది. అజయ్ క్లైమాక్స్ వరకూ దొరకడేమో అని ప్రేక్షకుడు భావిస్తాడు. కానీ సగం సినిమా అవ్వకముందే అజయ్‌ని తల్లి దగ్గరకు చేరుస్తాడు దర్శకుడు. అది మినహా.. ఆశ్చర్యకరమైన మలుపులేం ఉండవు. అజయ్ దొరికాక కథని ఎలా నడపాలో అర్థం కాలేదు. సైకో కూడా ఓ కుక్క సహాయంతో దొరికేస్తాడు. అక్కడైనా కథ అయిపోవాలి. కానీ... దానికి ఇంకో ట్విస్టు జోడించి, మరి కొంత సేపు కాలయాపన చేయాలని చూశాడు.
థ్రిల్లర్ చిత్రాలకు ముగింపు చాలా కీలకం. అక్కడ ప్రేక్షకుడు షాక్‌కి గురవ్వాలి. కానీ `పెంగ్విన్` క్లైమాక్స్ మాత్రం పేలవంగా ఉంది. కొండని తవ్వి ఎలుకని పట్టిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ మాత్రం దానికి ఇంత హడావుడీ అవసరమా? అనిపిస్తుంది. ప్రతీ పాత్రపైనా అనుమానం కలిగించేలా చేసి, అందులో ఒకరిని దోషిగా చూపించడం పాత పద్ధతి. వాళ్లెవరూ కాకుండా కొత్త నిందితుడిని తెరపైకి తీసుకురావడం నయా పద్ధతి. దర్శకుడు రెండోదాన్ని ఎంచుకున్నా.. అదెందుకో పెద్దగా అతకలేదు. మొత్తానికి సాదా సీదా కథనానికి మరింత పేలవమైన ముగింపు ఇచ్చి.. విసిగించాడు దర్శకుడు.
* నటీనటులు
కీర్తికి ఇది బరువైన పాత్ర. కడుపులో ఓ బిడ్డని పెట్టుకుని, మరో బిడ్డకోసం అన్వేషించే అమ్మ పాత్రలో మెప్పించింది. ఈ సినిమాకి ప్రధాన అస్సెట్ కీర్తినే. తను లేకపోయితే.. ఈ రెండు గంటలూ సినిమాని భరించడం కష్టమే. మిగిలినవాళ్లంతా తెలుగు వాళ్లకు తెలియని నటులే. ఈ సినిమాని తెలుగులోనూ డబ్ చేస్తారని తెలుసు. అయినా కూడా.. తెలుగువాళ్లని ఎంచుకోలేదు దర్శకుడు.దాంతో నికార్సయిన డబ్బింగ్ సినిమా చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
* సాంకేతిక వర్గం
దర్శకుడు అన్ని రంగాల్లోనూ ఫెయిల్ అయిన సినిమా ఇది. కథ, కథనాలు సరిగా రాసుకోలేదు. ట్విస్టులు బాలేవు. వాటిని రివీల్ చేసిన పద్ధతీ నచ్చదు. క్లైమాక్స్ అయితే మరింత నీరసంగా ఉంది. హిల్ స్టేషన్‌లో తీసిన సినిమా ఇది. కాబట్టి.. లొకేషన్లు చూడ్డానికి బాగున్నాయి. కెమెరా, నేపథ్య సంగీతం, ఎడిటింగ్ వర్క్.. వన్నీ ఓకే అనిపిస్తాయి.
* ప్లస్ పాయింట్స్
కీర్తి సురేష్
లొకేషన్లు
* మైనస్ పాయింట్స్
కథ
కథనం
ట్విస్టులు
* ఫైనల్ వర్డిక్ట్: మెప్పించని థ్రిల్లర్