పాన్ ఇండియా సినిమాలను వరసగా చేస్తున్న ప్రభాస్ కొత్త సినిమాలు కూడా అదే స్థాయిలో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ సినిమాకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్లో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రకటన కూడా వచ్చేసింది. ప్రీ ప్రొడక్షన్ జోరుగా సాగుతున్న ఈ సినిమాలో హీరోయిన్ గురించి పలురకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి.
ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం నాగ్ అశ్విన్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనెను సంప్రదించారట. దీపికకు కథ నచ్చడంతో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట కానీ భారీ పారితోషికం డిమాండ్ చెయ్యడంతో నిర్మాతలు ఆలోచనలో పడ్డారట. ఈ సినిమాకు పారితోషికంగా హిందీ వెర్షన్ థియేట్రికల్ రైట్స్ డిమాండ్ చేసిందని టాక్ వినిపిస్తోంది. దీపిక చెప్పిన రెమ్యూనరేషన్ దాదాపు ఎవరూ ఆఫర్ చేయకపోవచ్చు. ఎందుకంటే ప్రభాస్ సినిమాకు హిందీ థియేట్రికల్ రైట్స్ యాభై కోట్లకు పైనే ఉంటాయి. సినిమా క్రేజ్ ను బట్టి రిలీజ్ సమయానికి అది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఇది జస్ట్ గాసిప్ అయి ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఏదేమైనా దీపిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తే ప్రాజెక్ట్ రేంజ్ మరింతగా పెరుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మరి హీరోయిన్ గా దీపికను ఫైనలైజ్ చేస్తారా లేదా మరో హీరోయిన్ ను చూసుకుంటారా అనేది వేచి చూడాలి.