ఎట్టకేలకు షూటింగులకు అనుమతి వచ్చింది. లాక్ డౌన్ వల్ల గత కొంతకాలంగా షూటింగులకు ఆటంకం ఏర్పడిన సంగతి తెలిసిందే. అయితే షూటింగులకు అనుమతి ఇవ్వాల్సిందిగా చిత్రసీమ ప్రభుత్వానికి విన్నవించుకోవడంతో... ప్రభుత్వం స్పందించింది. దశల వారీగా షూటింగులకు అనుమతి ఇస్తామని, ఈలోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించుకోవచ్చని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం త్వరలోనే ప్రకటించనుంది. వీలైనంత తక్కువ మందితో షూటింగులు నిర్వహించుకోవాలని, ముఖ్యంగా ఇండోర్ షూటింగులు చేసుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని కేసీఆర్ సూచించారు.
నిన్న చిరంజీవి ఇంట్లో సినీ పరిశ్రమతో మంత్రి తలసాని భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈరోజు ముఖ్యమంత్రి తో చిత్రసీమ సమావేశమైంది. ఈ సందర్భంగా పరిశ్రమ ఎదుర్కుంటున్న సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సినీ కార్మికులను ఆదుకోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేశారు. జూన్‌లో షూటింగులు మొదలెట్టుకోవచ్చని, త్వరలోనే థియేటర్ల విషయంలోనూ ఓ నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ తెలిపారు.