కథానాయకుడు సూర్యకీ - తమిళ నాట థియేటర్ యాజమాన్యాలకూ పెద్ద యుద్ధమే జరుగుతోంది. జ్యోతిక ముఖ్య పాత్రలో తెరకెక్కించిన ఓ చిత్రాన్ని థియేటర్లలో కాకుండా నేరుగా ఓ టీ టీ వేదికపై విడుదల చేయాలని నిర్ణయించుకోవడమే ఈ తతంగానికి కారణం. థియేటర్లలో విడుదల చేయకపోతే.. భవిష్యత్తులోనూ సూర్య సినిమాల్ని ఏ థియేటర్ లోనూ ప్రదర్శించమని థియేటర్ సంఘాలు హెచ్చరించాయి. అయితే ఈ హెచ్చరికల్ని సూర్య ఏమాత్రం పట్టించుకోలేదు. తన సినిమాని ఎప్పుడు ఎవరికి అమ్ముకోవాలో తనకు తెలుసని ఘాటుగా సమాధానం చెప్పాడు.
అంతేకాదు.. తనకు అప్పులున్నాయని, ఇప్పుడు ఈ సినిమాని ఓటీటీకి విడుదల చేయకపోతే, వడ్డీలు పెరిగిపోతాయని, అందుకే సినిమాని అమ్ముకోవాల్సివచ్చిందని క్లారిటీ ఇచ్చాడు. అయితే థియేటర్ సంఘాల నిరసన జ్వాల తగ్గలేదు. ఈ నేపథ్యంలో తాజాగా సూర్య మరో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తన బ్యానర్‌లో రూపొందే సినిమాలన్నింటికీ ఇక మీదట ఓ టీ టీకే అమ్మాలని డిసైడ్ అయ్యాడట. నిర్మాతగా తన సినిమాలేవీ థియేటర్లో ప్రదర్శించనని తెగేసి చెబుతున్నాడు సూర్య. మరి సూర్య హీరోగా నటించిన సినిమాల మాటేమిటో? నిర్మాతగా సూర్య తక్కువ బడ్జెట్‌లో సినిమాల్ని పూర్తి చేస్తాడు. అవి ఓ టీ టీకి అమ్ముకుంటే ఆ బడ్జెట్ వరకూ తిరిగి వచ్చేస్తుంది. కానీ హీరోగా చేసేవన్నీ భారీ బడ్జెట్ సినిమాలే. వాటిని థియేటర్లో విడుదల చేసుకోవాల్సిందే. మరి.. దీనికి థియేటర్ యజమానులు ఏమంటారో?