గత శుక్రవారం విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకొంటున్న చిత్రం ఘాజీ. రివ్యూలు ఈ సినిమాని ఆకాశానికి ఎత్తేస్తుంటే, సినీ ప్రేమికులు ఘాజీ ఐడియాకు బ్రహ్మరథం పడుతున్నారు. మరోవైపు పైరసీగాళ్లూ రెచ్చిపోతున్నారు. ఈ సినిమా వసూళ్లపై దెబ్బ కొడుతున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఘాజీ విడుదలైన సంగతి తెలిసిందే. హిందీ వెర్షన్‌పై పైరసీ దెబ్బపడింది. కొన్ని సైట్లలో... విడుదలైన రెండో రోజే ఘాజీ పూర్తి సినిమా పెట్టేశార్ట. దాంతో చిత్రబృందం షాక్‌కి గురైంది. వెంటనే ఆ లింకుల్ని తొలగించేందుకు రంగంలోకి దిగింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయినట్టు తెలుస్తోంది. తొలి మూడు రోజులూ ఘాజీకి మంచి వసూళ్లే దక్కాయి. ఈ వారం పెద్ద ఎత్తున కొత్త సినిమాలొస్తున్నాయి.కాబట్టి.. ఈలోపే ఘాజీ వీలైనన్ని వసూళ్లు దక్కించుకోవాల్సివుంది. ఇంతలోనే ఇలా పైరసీ దాడిన పడడం దారుణం. కనీసం మంచి సినిమాలొచ్చినప్పుడైనా థియేటర్‌కి వెళ్లే చూడాలి అని సగటు ప్రేక్షకుడు అనుకోనంత వరకూ... పైరసీ రక్కసికి సినిమా బలవుతూనే ఉంటుంది.