పోకిరి... టాలీవుడ్ ఇచ్చిన ఓ వజ్రం. ఇలాంటి సినిమా నా కెరీర్‌లో ఒక్కటున్నా చాలు... అని హీరోలంతా అనుకునే సినిమా. టాలీవుడ్ చరిత్రని తిరగరాసిన సినిమా. మహేష్ బాబు - పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన పోకిరి సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఈ సినిమాని ఎందుకు గుర్తు చేస్తున్నామంటే.. పోకిరి విడుదలై నేటికి పదిహేనేళ్లు. కాబట్టి మహేష్ ఫ్యాన్సంతా.. పోకిరి జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు.
నిజానికి ఈ సినిమాలో ముందు అనుకున్న హీరో మహేష్ కాదు. బద్రి టైమ్ లోనే పూరి రాసుకున్న కథ ఇది. ఓసారి రవితేజతో చేద్దామనుకున్నారు. రవితేజకు కూడా కథ నచ్చేసింది. అంతా ఓకే అనుకున్న సమయంలో.. రవితేజకు మరో ఆఫర్ వచ్చింది. అదే `నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్`. ఆ సినిమా కోసం పోరికిని వదులుకున్నాడు రవితేజ. ఆ తరవాత.. సోనూసూద్ తో ఈ సినిమా చేసేద్దామనుకున్నాడు పూరి. అప్పటికి టాలీవుడ్ కి సోనూ ఎవరో తెలీదు. సోనూని ఈ సినిమాతో హీరోగా ఇంట్రడ్యూస్ చేద్దామనుకున్నాడు. కానీ సోనూతో సినిమా అనేసరికి నిర్మాతలు కంగారు పడ్డారు. అంత బడ్జెట్ ఓ కొత్త హీరోకి ఇవ్వలేమని చేతులెత్తేశారు. దాంతో.. సినిమా ఆగిపోయింది.
చివరికి... మహేష్ దగ్గరకు చేరింది. హీరోయిన్లలో కూడా చాలా మంది పేర్లు బయటకు వచ్చాయి. ముందు ఆయేషా టాకీయాని హీయియిన్‌గా ఎంపిక చేశారు. ఆ తరవాత పార్వతీ మెల్టన్ అనుకున్నారు. ఓ సందర్భంలో దీపికా పదుకొణే పేరు కూడా బయటకు వచ్చింది. చివరికి ఇలియానా ఫిక్సయ్యింది. అలా.. పోకిరిని వదులుకున్న వాళ్లు చాలామందే ఉన్నారు.