నటీనటులు: విక్రమ్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య లక్ష్మి, శోభితా ధూళిపాళ తదితరులు
దర్శకత్వం : మణిరత్నం
నిర్మాత: మణిరత్నం, సుభాస్కరన్ అల్లిరాజా
సంగీతం: ఏ ఆర్ రెహమాన్
సినిమాటోగ్రఫీ: రవి వర్మన్
ఎడిటర్: ఎ. శ్రీకర్ ప్రసాద్
రేటింగ్: 2.5/5
మణిరత్నం అనేది పేరు కాదు... ఓ బ్రాండ్. మణిరత్నం ఏ కథని ఎంచుకొన్నా... అందులో తనదైన ముద్ర వేస్తాడు. 'ఇది మణిరత్నం సినిమారా' అని ఫ్రేమ్ చూసి చెప్పేయొచ్చు. అది... మణిరత్నం సంపాదించుకొన్న ప్రేమ. లవ్ స్టోరీ, యాక్షన్, పొలిటికల్ డ్రామా - ఇలా ఏం చేసినా అందులో మణి మ్యాజిక్ ఉంటుంది. పాటల్లో, ఫ్రేముల్లో... మణి తిష్ట వేసుకొని కూర్చుంటాడు. అదంతా మణి మాయాజాలం.
తన కెరీర్‌లో తొలిసారి ఓ హిస్టారికల్ మూవీ తీశాడు. అదే 'పొన్నియన్ సెల్వన్'. మణిరత్నం ముఫ్ఫై ఏళ్ల కల ఈ సినిమా. అందులోనూ రెండు భాగాలుగా తీశాడు. దానికి తోడు.. విక్రమ్, కార్తి, జయం రవి, త్రిష, ఐశ్వర్య, ప్రకాష్ రాజ్, శరత్ కుమార్.. ఇలా ఎంతోమంది స్టార్లని తీసుకొచ్చాడు. ఎలా చూసినా థియేటర్లకు రప్పించే శక్తి.. ఈ సినిమాకి కావల్సినదానికంటే చాలానే ఉంది. మరి.. థియేటర్‌కి వెళ్లాక ఏమైంది? మణి మ్యాజిక్ మళ్లీ తెరపై కనిపించిందా? తన కలల సినిమా కాసులు కురిపించగలదా?
* కథ
ఎప్పుడో వెయ్యేళ్ల నాటి కథ ఇది. చోళ సామ్రాజ్యంలో యువరాజులిద్దరు. ఒకరు.. ఆదిత్య కరికాలుడు (విక్రమ్), మరొకరు అరుణ్ మౌళి (జయం రవి). కరికాలుడు యుద్ధాలు చేసి, రాజ్యాల్ని ఆక్రమించుకొంటూ వస్తుంటే, అరుణ్ మౌళి రాజ్య పాలన చేస్తుంటాడు. అయితే సింహాసనంపై మధురాంతకుడికి (రెహమాన్) ఆశ పుడుతుంది. ఈ రాజ్యానికి తనే అసలైన వారసుడని భావిస్తాడు. మిగిలిన సామంతరాజులు మధురాంతకుడితో చేతులు కలుపుతారు.
చోళ సామ్రాజ్య పతనానికి ప్రణాళిక రచిస్తారు. ఈ వ్యవహారమేంటో తెలుసుకుని రమ్మని తనకు అత్యంత ఆప్తుడైన వల్లవరాయన్ (కార్తి)ని ఓ గూఢచారిలా పంపుతాడు కరికాలుడు. ఈ ప్రయాణంలో వల్లవరాయన్ ఏం తెలుసుకొన్నాడు? చోళుల నుంచి అధికారాన్ని లాక్కోవడానికి పాండ్య రాజులు ఎలాంటి కుట్రలు పన్నుతున్నారు? వాటి వెనుక మూలం ఏమిటి? ఇదంతా మిగిలిన కథ.
* విశ్లేషణ
ఎప్పుడో 70 ఏళ్ల క్రిందట కల్కి అనే రచయిత రాసిన `పొన్నియన్ సెల్వన్` అనే నవలకు తెర రూపం ఈ చిత్రం. ముఫ్ఫై ఏళ్ల నుంచే.. ఈ నవలని సినిమాగా తీయాలని మణిరత్నం అనుకొన్నారు. ఆ కల ఇప్పటికి తీరింది. ఛోళులు, పాండ్యుల కథ తెలుగువారి కంటే తమిళ వాసులకే బాగా తెలుసు. అది వారి చరిత్రలో భాగం. కాబట్టి... తెలుగువాళ్లకు ఆ పాత్రలు రిజిస్టర్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది.
పొన్నియన్‌లో కథంటూ ఏమీ ఉండదు. సింహాసనం కోసం ప్రత్యర్థులు పన్నే కుట్రలూ కుతంత్రాలే కనిపిస్తాయి. అయితే మణిరత్నంని వాటి కంటే.. ఆయా పాత్రల స్వభావమే ఎక్కువ ఆకర్షించి ఉండొచ్చు. ఈ కథలో ఎన్నో పాత్రలున్నాయి. ప్రతి పాత్రకూ ఓ కథ ఉంది. ఎవరినీ పాజిటీవ్ అనలేం. అలాగని నెగిటీవ్ అని చెప్పలేం. ఆయా సందర్భాలు, పరిస్థితులే మనుషుల్ని అలా మారుస్తుంటాయి. ఆ లక్షణాలు మణిరత్నాన్ని ఆకర్షించి ఉంటాయి.
కాకపోతే.. ఇక్కడో చిక్కు ఉంది. ఎంత కాదన్నా ఇది చరిత్ర పాఠం.రాజ్యాలు, ఆ పేర్లూ, ఆ వ్యవహారాలూ అంతగా బుర్రకు ఎక్కవు. ఏ రాజ్యం కథ తీసుకొన్నా ఇంచుమించు ఇలానే ఉంటుంది. పాత్రల స్వభావాలు నవల చదువుతున్నప్పుడు ప్రేక్షకుడు ఫీల్ అవుతాడేమో? దాన్ని తెరపై తీసుకొచ్చేటప్పుడు మాత్రం విజువల్ గా చెప్పాల్సిందే. అక్కడ తెలివితేటలేం పనికి రావు. ఈ కథని మణిరత్నం ఎంత బాగా అర్థం చేసుకొన్నాడో... అంతే బాగా ప్రేక్షకులకూ అర్థమయ్యేలా తీర్చిదిద్దాలి.
ఈ విషయంలో మణి ఫెయిల్ అయ్యాడనే అనిపిస్తుంది. సినిమా నడుస్తున్నా.. ఏ పాత్ర ఏమిటో? ఎవరి లక్ష్యం ఏమిటో అంత తేలిగ్గా అర్థం అవ్వవు. ముఖ్యంగా ఐశ్వర్యరాయ్ పాత్రని పాజిటీవ్ గా తీసుకోవాలా? నెగిటీవ్ యాంగిల్ లో ఆలోచించాలా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పాత్రల మధ్య సంభాషణల్లో కూడా దర్శకుడు తన తెలివితేటల్ని చూపించాడు. ఉదాహరణకు.. త్రిష - ఐశ్వర్యరాయ్ మధ్య ఓ సన్నివేశం ఉంది. అందులో అన్నీ... లోతైన సంభాషణలే. బంగారు గొలుసులతో ఉన్నా అనే మాట ఐశ్వర్యరాయ్ తో పలికించారు. అయితే.. ఆ పాత్ర స్వేచ్ఛకు దూరంగా ఉంది, అనుకోని పరిస్థితుల్లోనే ఇలా ప్రవర్తించాల్సివస్తుంది అనేది దృశ్య రూపకంలో చెప్పలేకపోయాడు మణిరత్నం.
ఇక విజువల్స్ విషయానికి వద్దాం. రాజుల కథ అనగానే యుద్ధాలు, కోటలూ ఉంటాయని ఆశించడం సహజం. వాటిని భారీగానే చూపించాలన్న ప్రయత్నం కనిపించింది. అయితే.. బాహుబలిలో యుద్ధాలు చూశాక.. ఎంత పెద్ద సెటప్ చేసినా, కళ్లకు ఆనవు. మణిరత్నం పరిస్థితీ అదే అయ్యింది. ఆయనా భారీగానే తీయాలనే చూశాడు. కానీ... బాహుబలితో పోల్చుకొంటే మాత్రం అవి కూడా తేలిపోతాయి. సినిమా ప్రారంభంలోనే ఓ యుద్ధ సన్నివేశం వస్తుంది.అది ఏమంత ఎఫెక్టీవ్ గా ఉండదు. చివర్లో నౌకపై పోరాట దృశ్యాన్ని మాత్రం బాగా హ్యాండిల్ చేశారు. విజువల్ ఫీస్ట్ గా చెప్పడం కంటే.. ఎమోషన్ వైపు నుంచి నరుక్కొని రావడం మంచిదని మణి భావించి ఉంటాడు. అయితే.. విచిత్రం ఏమిటంటే.. ఒక్క సీన్‌లో కూడా `ఇది మణిరత్నం షాట్ రా` అనిపించేలా లేకపోవడం.
* నటీనటులు
తెరపై చాలామంది కనిపిస్తారు. అయితే ఎక్కువ స్క్రీన్ స్పేస్ మాత్రం కార్తికే దక్కింది. ఈ కథని నడిపించే సూత్రధారి కార్తినే. అలాగని కార్తిని మరీ కమర్షియల్ సినిమాలో హీరోలా చూపించలేదు. ఆ పాత్ర ఎంత చేయాలో అంతే చేస్తుంది. విక్రమ్ దాదాపుగా అతిథి అయిపోయాడు. ఫస్ట్ సీన్‌లో ఓసారి. .. ఇంట్రవెల్ లో ఓసారి.. చివర్లో మరోసారి కనిపిస్తాడు.
బహుశా..పార్ట్ 2లో విక్రమ్ పాత్రకు ఎక్కువ స్పేస్ ఉండి ఉంటుంది. జయం రవి పాత్ర కూడా కీలకమే. తను కూడా తన వంతు న్యాయం చేశాడు. ఐశ్వర్యరాయ్, త్రిషల అందం ఏమాత్రం తగ్గలేదు. ఆయా పాత్రల్ని దర్శకుడు మలిచిన తీరు కూడా ఆకట్టుకుంటుంది. శరత్ కుమార్, ప్రకాష్ రాజ్‌లు తమ అనుభవాన్ని రంగరించారు. ప్రతీ పాత్రకీ ప్రాధాన్యం ఇవ్వడం, కథలోకి తీసుకురావడంలో మణి మార్క్ కనిపిస్తుంది.
* సాంకేతిక వర్గం
మణిరత్నం కెరీర్‌లో భారీ బడ్జెట్ తో రూపొందించిన చిత్రమిది. నిర్మాణ విలువలు ఆకట్టుకొంటాయి. తోట తరణి సెట్స్ బాగున్నాయి. రెహమాన్ నేపథ్య సంగీతంలో మార్క్ కనిపిస్తుంది. నృత్య రూపకాల్ని కథలో భాగం చేయడం బాగుంది. వాటిని విజువలైజ్ చేయడం కూడా నచ్చుతుంది.
పాటలు అంతగా గుర్తుండవు. యుద్ధ సన్నివేశాలు తేలిపోయాయి. తనికెళ్ల భరణి అందించిన సంభాషణలు కొన్ని బాగున్నాయి. చరిత్రలో నిలిచిపోయే పాత్రల్ని, సంఘటనల్ని తెరపైకి తీసుకురావాలన్న మణిరత్నం సంకల్పం గొప్పది. కానీ... ఆ చరిత్ర పాఠాన్నే సినిమాగా మలిచినప్పుడు ప్రేక్షకులకు అర్థమయ్యేలా తీయాలి.. అనే ఆలోచన కూడా తోడైతే ఇంకా బాగుండేది.
* ప్లస్ పాయింట్స్
భారీ తారాగణం
క్లైమాక్స్
* మైనస్ పాయింట్స్
అర్థం కాని చరిత్ర పాఠం
స్లో నేరేషన్
* ఫైనల్ వర్డిక్ట్: మణి మార్క్ కనిపించని చరిత్ర పాఠం