ఈ పూజ‌కు... మూడు కోట్లు స‌మ‌ర్ప‌యామి!

By iQlikMovies - July 10, 2020 - 13:24 PM IST

మరిన్ని వార్తలు

క‌రోనా కాలం ఇది. హీరోలూ, హీరోయిన్లూ పారితోషికాలు త‌గ్గించుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. `నా పారితోషికాన్ని త‌గ్గించుకోవ‌డానికి రెడీనే` అంటూ కీర్తి సురేష్‌, రాశీఖ‌న్నాలాంటి వాళ్లు చెబుతున్నారు. ర‌కుల్ అయితే ఏకంగా 50 శాతం రిబేటు ఇచ్చేసింది. కానీ... హీరోయిన్లంతా ఒక‌లా ఉండ‌రు క‌దా. కొంత‌మంది మాత్రం `మాకు ఇంత ఇవ్వాల్సిందే ` అంటూ మొండి ప‌ట్టు ప‌డుతున్నారు పూజా హెగ్డేలా. తెలుగునాట టాప్ హీరోయిన్ల‌లో పూజా పేరు త‌ప్ప‌కుండా ఉంటుంది. త‌మ‌న్నా, స‌మంత‌, అనుష్క‌, కీర్తి కంటే... పూజానే టాప్ ఇప్పుడు.

 

అర‌వింద స‌మేత‌, అల వైకుంఠ‌పుర‌ములో చిత్రాల‌తో సూప‌ర్ హిట్లు త‌న ఖాతాలో వేసుకుంది. ఆ సినిమా విజ‌యాల్ని చూసే ఇప్పుడు పారితోషికం పెంచేసింది. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ పూజా పారితోషికం 1.5 నుంచి 1.75 కోట్ల వ‌ర‌కూ ఉండేది. ఇప్పుడు ఏకంగా 3 కోట్ల‌కు పెంచేసింద‌ట‌. అనుష్క లాంటి క‌థానాయిక‌ల‌కు ఇచ్చే రెమ్యున‌రేష‌న్ ఇది. ఆ స్థాయిని అందుకోవ‌డానికి అనుష్క‌కి చాలా కాలం ప‌ట్టింది. అలాంటిది రెండు సినిమాల‌కే పూజా మూడు కోట్లు డిమాండ్ చేయ‌డం చూసి నిర్మాత‌లు ఆశ్చ‌ర్య‌పోతున్నారు.

 

క‌రోనా క‌దా, పారితోషికం త‌గ్గించుకో అంటే స‌సేమీరా అంటోంద‌ట‌. మూడు కోట్లకు రూపాయి త‌గ్గ‌న‌ని చెప్పేస్తోంద‌ట‌. పూజా చేతిలో `రాధేశ్యామ్‌`,`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిర‌ల్‌` సినిమాలున్నాయిప్పుడు. రెండు సినిమాల‌పైనా చాలా హోప్స్ పెట్టుకుంది. ఇవి కూడా హిట్ట‌యితే.. పూజా ఇక ఆగ‌దు. పూజానే కావాల‌నుకుంటే.. మూడు కోట్లు అర్పించుకోవాల్సిందే. లేదంటే మ‌రో హీరోయిన్ ని ఎంచుకోవాలంతే. పూజా మాత్రం త‌గ్గ‌దు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS