వెబ్ సిరీస్ రంగానికి క్రమక్రమంగా దగ్గరవున్నారు స్టార్లు. ఇది వరకు వెబ్ సిరీస్ లో నటించడానికి అంతగా ఆసక్తి చూపించనివాళ్లు కూడా... ఇప్పుడు అటు వైపుగా అడుగులేస్తున్నారు. సమంత, తమన్నా లాంటి స్టార్లు ఇప్పటికే.. వెబ్ సిరీస్‌ల వైపు దృష్టి సారించారు. ఇప్పుడు ఈ జాబితాలో త్రిష కూడా చేరింది.
రామ సుబ్రమణ్యన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఓ వెబ్ సిరీస్‌లో నటించడానికి త్రిష అంగీకారం తెలిపింది. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ వెబ్ సిరీస్‌ని రూపొందిస్తున్నారు. తండ్రీ - కూతుర్ల అనుబంధం నేపథ్యంలో సాగే వెబ్ సిరీస్ ఇది. 12 ఎపిసోడ్లుగా ఈ వెబ్ సిరీస్‌ని తీర్చిదిద్దబోతున్నారు. త్రిష తండ్రిగా ఓ స్టార్ నటుడు కనిపిస్తాడని సమాచారం. ఈ వెబ్ సిరీస్ కోసం త్రిష భారీ ఎత్తున పారితోషికం అందుకుందని, సాధారణంగా ఓసినిమాకి తీసుకునే పారితోషికం కంటే అది ఎక్కువని తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి.