కొన్నాళ్ళ క్రితం ఓ అభిమాని ముంబై వెళ్ళాడు తన అభిమాన నటిని కలుసుకునేందుకు. ఆ హీరోయిన్, తన అభిమాని తన కోసం చాలా దూరం నుంచి వచ్చాడని తెలుసుకుని, అతన్ని కలిసింది.. ఇంకెప్పుడూ అలాంటి రిస్క్ చేయొద్దని సూచించింది. అతను పడ్డ కష్టం తనను బాధించిందని పేర్కొంది. ఆమె ఎవరో కాదు, స్టన్నింగ్ బ్యూటీ పూజా హెగ్దే. సోషల్ మీడియాలో బోల్డంత మంది ఫాలోవర్స్ హీరోయిన్లకు వుండడం సహజమే.
అయితే, వారి కోసం అభిమాన సంఘాలు ఏర్పాటవడం, వాటి ద్వారా అభిమానులు సేవా కార్యక్రమాలు చేయడం చాలా అరుదుగా కనిపిస్తుంటుంది. నేటితరం హీరోయిన్లలో రష్మికకి ఆ స్థాయి ఫాలోయింగ్ వుంది. పూజా హెగ్దే కూడా ఈ విషయంలో తక్కువేమీ కాదు. తెలంగాణలో పూజా హెగ్దే అభిమాన సంఘాల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నాయి. పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి ఈ అభిమాన సంఘాలు.
ప్రస్తుతానికి చిన్నా చితకా సేవా కార్యక్రమాలు మాత్రమే చేస్తున్నామనీ, ముందు ముందు మరింత పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తామని అభిమానులు అంటున్నారు. సోనూ సూద్ కరోనా లాక్ డౌన్ సమయంలో చేపట్టిన సేవా కార్యక్రమాల తర్వాత కొత్త కొత్తగా మరింతమంది సెలబ్రిటీలకు అభిమాన సంఘాలు ఏర్పాటవుతున్నాయి. అయితే, కొందరు ఈ సంఘాల ముసుగులో వసూళ్ళకు పాల్పడుతూ ఆయా నటీనటులకు తలనొప్పులు తెచ్చిపెడుతున్న సందర్భాలూ లేకపోలేదు. ఏదిఏమైనా టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న పూజా హెగ్దే, ఇప్పుడీ అభిమాన సంఘాలతో తన స్థాయిని మరింత పెంచుకుందని నిస్సందేహంగా చెప్పొచ్చు.