పూనమ్ కౌర్.. సినిమాలేం చేయకపోయినా, నిత్యం ఏదో ఓ రూపంలో వార్తల్లో నిలుస్తోంది. తన ట్వీట్లతో టాలీవుడ్ లో వేడి పుట్టిస్తుంటుంది. ఓ దర్శకుడిపై పరోక్షంగా పూనమ్ ట్వీట్ల దాడి చేయడం నెటిజన్లకు సుపరిచితమైన విషయమే. ఓ దర్శకుడు తన కెరీర్‌ని నాశనం చేశాడని తరచూ చెబుతూ ఉంటుంది. వీలున్నప్పుడల్లా ట్వీట్లతో విరుచుకుపడిపోతుంటుంది. ఈసారీ అంతే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యతో మరోసారి ట్వీట్ చేయడానికి ఓ కారణం దొరికింది పూనమ్‌కి. తాను ఓ దశలో ఆత్మహత్య చేసుకుందామనుకున్నానని, ఆ విషయాన్ని ఆ దర్శకుడితో చెబితే.. `సూసైడ్ చేసుకున్నంత మాత్రన ఒరిగేదేం ఉండదు.. ఆ రోజుకి వార్త అవుతావంతే` అంటూ లైట్ తీసుకున్నాడని మరోసారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లిపోయి, సదరు దర్శకుడ్ని తూర్పారబట్టింది పూనమ్.
తనకు అవకాశాలు రాకుండా చేయడమే కాకుండా, సినిమా వేడుకలకూ ఎవరూ పిలవకుండా దూరంగా పెట్టాడని, సావిత్రి గురించి బహిరంగ వేదికలమీద లెక్చర్లు దంచి కొడుతూ, లోకల్ టాలెంట్ ని ఏమాత్రం ప్రోత్సహించడని సెటైర్లు వేసింది. దర్శకుడి పేరు చెప్పకపోయినా, ఆయనెవరన్నది బహిరంగ రహస్యమే. కాకపోతే.. ఇప్పటి వరకూ ఇలాంటి ఇష్యూలమీద ఆ దర్శకుడు స్పందించిందే లేదు.