కరోనా - లాక్ డౌన్ వల్ల సినిమా వ్యవస్థ ప్లానింగ్ అంతా చల్లా చెదురైపోయింది. రిలీజ్ డేట్లన్నీ తారుమారు అయిపోయాయి. షూటింగులు మొదలై, అవన్నీ ఓ కొలిక్కి వస్తే తప్ప.. కొత్త రిలీజ్ డేట్లు ఖరారు కావు. దానికి చాలా టైమ్ ఉంది. జనవరి 8న ఆర్.ఆర్.ఆర్ విడుదల కావాల్సివుంది. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆ డేట్‌కి ఆ సినిమా రావడం కష్టం. ఆర్.ఆర్.ఆర్ సినిమా వేసవికి వాయిదా పడే ఛాన్సుందని చిత్ర వర్గాలే చూచాయిగా చెప్పేస్తున్నాయి. అందుకే ఆ రిలీజ్ డేట్‌పై ప్రభాస్ కన్ను పడింది. ప్రభాస్‌కథానాయకుడిగా యూవీ క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. రాధాకృష్ణ దర్శకుడు 2018లో సినిమా మొదలైనా, ఇప్పటి వరకూ షూటింగ్ పూర్తవలేదు. రకరకాల కారణాల వల్ల సినిమా షూటింగ్ ఆలస్యం అయ్యింది.
ఈ దసరాకి ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకున్నారు. కానీ అదీ సాధ్యం కాలేదు. 2021 వేసవికే ఈ సినిమా వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఆర్.ఆర్.ఆర్ రాకపోతే.. ఆ డేట్ ని వాడుకోవాలని ప్రభాస్ భావిస్తున్నాడు. ఆర్.ఆర్.ఆర్ సిద్ధం కాకపోతే, సంక్రాంతికి రాకపోతే.. అదే డేట్‌ని తన సినిమాని విడుదల చేద్దామని ఫిక్స్ అయ్యాడు. సంక్రాంతి చాలా మంచి సీజన్. ఎన్ని సినిమాలు విడుదలైనా, జనం చూసేస్తారు. సో.. సంక్రాంతికి రావాలన్నది ప్రభాస్ ప్లాన్. అయితే ఆర్.ఆర్.ఆర్.. వాయిదా పడినట్టు స్పష్టమైన సంకేతాలు రావాలి. అది రావాలంటే ఇంకొంత సమయం పడుతుంది. అందాకా.... ఈ సస్పెన్స్ తప్పదు.