కరోనా ప్రభావం చిత్రసీమపై విపరీతంగా ఉంది. ఇప్పటికే షూటింగులు ఆగిపోయాయి. సినిమా థియేటర్లన్నీ బంద్. అయితే... అన్నింటికంటే ఎక్కువగా ఈ ఎఫెక్ట్ ప్రభాస్ సినిమాపై పడిందని టాక్. ప్రభాస్ - రాధాకృష్ణ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. యూవీ క్రియేషన్స్ - గోపీకృష్ణ మూవీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇటలీ నేపథ్యంగా సాగే సినిమా ఇది. ఇప్పటికే ఇటలీలో కొంత మేర షూట్ చేశారు. ఇండోర్ సన్నివేశాల కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా కొన్ని సెట్లు వేశారు.
ఇటీవల చిత్రబృందం ఇటలీ వెళ్లొచ్చింది. అక్కడ మరో మారు షూటింగ్ చేయాలి. ఈ వేసవిలో ఓ షెడ్యూల్ చేయాల్సివుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇటలీలో షూటింగ్ అసాధ్యం. ఒకవేళ కరోనా ప్రభావం తగ్గి - షూటింగులు యధావిధిగా మొదలైనా సరే, ఇటలీ వెళ్లకూడదని చిత్రబృందం డిసైడ్ అయ్యింది. అందుకే ఇప్పుడు ఇటలీలో తీయాల్సిన సన్నివేశాలు కూడా హైదరాబాద్‌లోనే షూట్ చేయాలని భావిస్తోంది. అందుకోసం అదనంగా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో కొన్ని సెట్లు రూపొందించే పనిలో పడింది చిత్రబృందం. ఇక.. ప్రభాస్ సినిమా షూటింగ్ ఫారెన్‌లో జరగదు. సన్నివేశాలన్నీ హైదరాబాద్‌లోనే తీస్తారు.
అవుడ్డోర్ కోసం రాసుకున్న సన్నివేశాలతోనే ఇబ్బంది. వాటిని ఇండోర్‌లోకి మార్చుకుని రాసుకోవాలి. పాటలు, కొన్ని సన్నివేశాల వరకూ ఓకే. యాక్షన్ సీన్లయితేనే ఇబ్బంది. తప్పకుండా అవుడ్డోర్‌లోనే తీయాల్సిన సన్నివేశాలు కొన్ని ఉంటాయి. వాటిని ఎలా మేనేజ్ చేస్తారో మరి.