ప్రభాస్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. ఓ సినిమా చేతిలో ఉండగానే, రెండు మూడు సినిమాల్ని సెట్ చేసేస్తున్నాడు. అందులో భాగంగానే 25వ సినిమా కూడా ఫిక్స్ చేసేశాడు. ఈ చిత్రానికి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తాడని ముందు నుంచీ ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ప్రభాస్ 25వ సినిమాకి సందీప్ నే దర్శకుడు. ఈచిత్రానికి `స్పిరిట్` అనే వెరైటీ టైటిల్ పెట్టారు. సందీప్ రెడ్డితో పాటు యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషలతో పాటు మరో 4 అంతర్జాతీయ భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. ఓరకంగా ఇది పాన్ వరల్డ్ మూవీ అన్నమాట. ఇటీవల ప్రభాస్ కి కథ వినిపించాడు సందీప్. దానికి ప్రభాస్ ఓకే అనేశాడు. 2022 చివర్లో ఈ సినిమా పట్టాలెక్కబోతోంది. ప్రస్తుతం రణవీర్ కపూర్‌తో యానిమల్ అనే సినిమా చేస్తున్నాడు సందీప్. అది పూర్తయ్యాక.. `స్పిరిట్` కథపై దృష్టి పెడతాడు. ఈలోగా సలార్, ఆదిపురుష్ సినిమాల్ని పూర్తి చేస్తాడు ప్రభాస్. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.