ఆరడుగుల ఎత్తు
కండరాల్లో ప్రవహించే కరెంట్
కొండలను ఢీ కొట్టే కటౌట్
- ఇవన్నీ ప్రభాస్‌కి సరిపడే ఉపమానాలు.
`నాలా కొట్టే దమ్ము ఎవరికైనా ఉందా.. లేదంటే మళ్లీ నన్నే ట్రై చేయమంటారా`` అని చెప్పగలిగే స్టామినా ఉన్న ఏకైక తెలుగు హీరో... ప్రభాస్.
అవును... బాహుబలి రికార్డులు బాహుబలి 2 నే బద్దలు కొట్టినట్టు... ప్రభాస్‌ని కొట్టే దమ్ము ప్రభాస్‌కి మాత్రమే ఉంది. దర్శకులకు మోస్ట్ వాంటెడ్ హీరో నిర్మాతలకు రికార్డులు బాంఢాగారం.. అమ్మాయిలకు.. మిర్చీ లాంటి కుర్రాడు!
ఈశ్వర్‌తో మొదలైన ప్రభాస్ ప్రస్థానం అంచలంచెలుగా ఎదుగుతూ సాగింది. వర్షంతో తొలి హిట్టు అందుకున్న ప్రభాస్ .. `ఛత్రపతి`తో తనలోని మాస్ పవర్‌ని తొలిసారి చూపించాడు. బుజ్జిగాడు, డార్లింగ్, మిస్టర్ పర్‌ఫెక్ట్.. ఇలా ఒక్కో మెట్టూ ఎదుగుతూ వచ్చాడు. `మిర్చి`తో కొత్త రికార్డులు లిఖించాడు.
ఇవన్నీ ఒక ఎత్తు.. `బాహుబలి` మరో ఎత్తు. రాజమౌళి కన్న కలని సాకారం చేసిన... హీమాన్ ప్రభాస్. బాహుబలి అంటే ఇలానే ఉంటాడేమో అన్నంతగా ఆ పాత్రలో ఒదిగిపోయాడు. కేవలం ఈ సినిమా కోసమే తన పెళ్లిని కూడా పక్కన పెట్టాడు ప్రభాస్. బాహుబలితో తన కష్టం ఫలించింది. బాహుబలి ప్రభాస్‌కి అంతర్జాతీయంగా క్రేజ్‌ని తీసుకొచ్చింది. ఇండియన్ సూపర్ స్టార్ రేంజుకు తీసుకెళ్లింది. ఇంత ఎదిగినా.. ప్రభాస్ ఒదిగే ఉంటాడు. విజయాన్ని, దాంతో పాటు వచ్చిన కీర్తిని నెత్తిన తీసుకోకుండా.. ఇంకా నేల మీదే ఉంటున్నాడు. అదే అతని అభిమాన గణాన్ని పెంచుతోంది.
సాహో, జాన్ (టైటిల్ ఇంకా ఖరారు కాలేదు).. ఈ రెండు సినిమాలూ బాలీవుడ్ స్థాయిలోనే తీర్చిదిద్దుతున్నారు. రెండు సినిమాల బడ్జెట్ దాదాపుగా రూ.400 కోట్లు. ప్రభాస్ సినిమాపై రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టడానికి నిర్మాతలు రెడీ అవుతున్నారంటే.. ప్రభాస్ రేంజు ఏ పాటితో అర్థమవుతోంది. ఈ రెండూ హిందీలోనూ విడుదల అవుతున్నాయి.
కొడితే ఏనుగు కుంభ స్థలాన్ని కొట్టమంటారు కదా.. అలా బాహుబలితో బాలీవుడ్ లోనే పాగా వేసేశాడు ప్రభాస్. ఇలా మన డార్లింగ్ మరిన్ని అద్భుతమైన విజయాలు సాధించాలని, తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ప్రభాస్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటోంది ఐక్లిక్ మూవీస్.