తెలుగు సినిమా ఉన్నంతకాలం 'బాహుబలి' ఘనత అలాగే ఉంటుంది. రెండు పార్టులుగా 'బాహుబలి'ని తెరకెక్కించిన రాజమౌళి, తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వ వ్యాపితం చేశాడు. 'ది బిగినింగ్'కి మించి 'ది కంక్లూజన్'తో విజయాన్ని అందుకోవడం ఆషామాషీ విషయమా? ఓ సినిమా కోసం దర్శకుడు కష్టపడటం మామూలే. నటీనటులు సాహోసోపేతమైన ఫీట్లు చేయడం చూస్తున్నాం. కానీ నిర్మాత, దర్శకుడు, నటీనటులు అందరూ కలిసి ఓ మహాయజ్ఞం చేయడం అంటే ఎలా ఉంటుందో 'బాహుబలి'ని చూస్తే అర్థమవుతుంది. సక్సెస్‌ని ఎంజాయ్ చేయడమొక్కటే కాదు, అంతకు మించిన సక్సెస్‌ని చవిచూడాలన్న కసి 'బాహుబలి' టీమ్ ప్రదర్శించింది. అదే ఈ సినిమాకి కనీ వినీ ఎరుగని విజయాన్ని కట్టబెట్టింది. ఆరు నెలలు ఓ సినిమాకి డేట్స్ ఇవ్వడమంటేనే పెద్ద హీరోలకి కష్టం. ఏడాది ఇంకా కష్టం. అలాంటిది ఏళ్ళ తరబడి ఓ సినిమా కోసం డేట్స్ ఇచ్చిన ప్రభాస్‌ని ప్రత్యేకంగా అభినందించి తీరాలి. వంద సినిమాలు చేస్తే వచ్చే ఇమేజ్ ఒక్క 'బాహుబలి'తో ప్రభాస్ దక్కించుకున్నాడు. అందుకే ఎప్పటికీ తన కెరీర్‌లో 'బాహుబలి' ప్రత్యేకమైన చిత్రమవుతుందన్నాడు. సినిమా మాత్రమే కాదు, సినిమా కోసం పనిచేసిన సాంకేతిక నిపుణులు, నటీనటులు, దర్శకుడు, నిర్మాతలు ఎప్పటికీ తనకు ఆప్తులేనని ప్రభాస్ చెప్పాడు. ప్రభాస్ ఒక్కడే కాదు, 'బాహుబలి' టీమ్‌లో ఎవర్ని కదిపినా ఇదే మాట చెప్తారు. సాహోరే బాహుబలి!