ప్రభాస్ ఇమేజ్, క్రేజ్... ఇప్పుడు హిమాలయ సమానం. ప్రభాస్ సినిమా చేస్తుంటే.. అది ఆటోమెటిగ్గా పాన్ ఇండియా సినిమా అయిపోతోంది. ప్రభాస్ సినిమా ఏదీ 200 - 300 కోట్లకు తక్కువ కావడం లేదు. ప్రభాస్ సినిమాలో స్టార్లకు కొదవ ఉండడం లేదు. కాస్త నెగిటీవ్ టాక్‌వచ్చినా, కోట్లు కుమ్మరించేస్తున్నాయి సినిమాలు. ఇవన్నీ ఓకే.. కానీ... ప్రభాస్ ప్లానింగే పూర్తిగా గందరగోళంగా మారింది. ప్రభాస్ చేతిలో `రాధే శ్యామ్` ఉంది. ఆ తరవాత.. ప్రభాస్ ఏ సినిమా ముందుగా పట్టాలెక్కిస్తాడు? అన్న విషయంలోనే స్పష్టత కరువయ్యింది.
`ఆది పురుష్`తో పాటు నాగ అశ్విన్ సినిమానీ ఒప్పుకున్నాడు ప్రభాస్. కానీ.. ఈ రెండింటిలో ఏది ముందు? ఏది వెనుక? అనే గందరగోళం ఉంది. ఇది చాలదన్నట్టు`కేజీఎఫ్` దర్శకుడు ప్రశాంత్ నీల్ కి ఓకే చెప్పాడు ప్రభాస్. ముందు ప్రశాంత్ నీల్ సినిమానే మొదలెట్టే ఛాన్సుందని ప్రచారం జరుగుతోంది. అయితే.. 2021 మార్చిలో `ఆది పురుష్` మొదలైపోతుందట. తొలి షెడ్యూల్ ని అప్పుడే ప్లాన్ చేశారు. నాగ అశ్విన్ సినిమా అయితే 2021 జనవరిలో షెడ్యూల్ ఉండబోతోంది. ఈ రెండింటి మధ్య.. ప్రశాంత్ నీల్ సినిమా మొదలయ్యే అవకాశమే లేదు.
ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సినిమా ఓకే అయ్యింది అన్న వార్త వచ్చాక... అటు ఓం రౌత్, ఇటు నాగ అశ్విన్ కన్‌ఫ్యూజన్ లో పడిపోయారు. `మరి మా సినిమా ఎప్పుడు` అన్నది వాళ్ల ప్రశ్న. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం `ఆదిపురుష్` నే ముందు గా ప్రారంభమవుతుందట. ఆ తరవాత.. నాగ అశ్విన్ సినిమా ఉండొచ్చు. కాకపోతే.. ఆ ఇద్దరు దర్శకులకే క్లారిటీ లేదు. ప్రభాస్ ఈ విషయంలో కాస్త ప్లానింగ్ తో వ్యవహరిస్తే బాగుంటుంది. లేదంటే.. ఈ గందరగోళంలో దర్శకులు స్క్రిప్టుపై దృష్టి పెట్టలేరు.