చేతిలో హిట్టున్న హీరోలు దొరక్కపోవడం విచిత్రం. అలాంటి విచిత్రమైన పరిస్థితుల్లో కొట్టిమిట్టాడుతున్నాడు వంశీ పైడిపల్లి. మహర్షి తో ఓ సూపర్ డూపర్ హిట్టుకొట్టిన వంశీ.. ఇప్పుడు హీరోల కోసం అగచాట్లు పడుతుండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నిజానికి.. మహర్షి పూర్తయిన వెంటనే, మహేష్ తో మరో సినిమా చేయడానికి ప్లాన్ చేశాడు వంశీ పైడిపల్లి. కానీ స్క్రిప్టు నచ్చకపోవడం వల్ల దాన్ని పక్కన పెట్టేశాడు. అప్పటి నుంచీ.. హీరోల కోసం అన్వేషిస్తూనే ఉన్నాడు వంశీ.
తన ఆశలన్నీ చరణ్‌పైనే ఉన్నాయి. ఎందుకంటే.. `ఆర్.ఆర్.ఆర్` తరవాత చరణ్ సినిమా ఏదీ ఫిక్స్ కాలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ సినిమాకీ కమిట్ అవ్వకుండా ఉన్న హీరో చరణ్ మాత్రమే. కాబట్టి చరణ్‌ని మెప్పించాలన్న కృత నిశ్చయంతో ఉన్నాడు వంశీ. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన `ఎవడు` మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ చేయాలని వంశీ ప్రయత్నిస్తున్నాడట. `ఎవడు` టైమ్ లోనే చరణ్, వంశీ... ఈ సీక్వెల్ గురించి మాట్లాడుకున్నారని, చరణ్ అప్పుడే ఈ కథకి ఓకే చెప్పాడని సమాచారం అందుతోంది. అయితే.. అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారాయి. ఫక్తు కమర్షియల్ సినిమాలు పెద్దగా రుచించడం లేదు. పెద్ద కాన్వాస్ ఉన్న కథలకే హీరోలు ఓకే చెబుతున్నారు. చరణ్ కూడా `మహర్షి` టైపు కథ కోసం చూస్తున్నాడట. అందుకే.. ఎందుకైనా మంచిదని చరణ్ కోసం రెండు మూడు కథలు రెడీ చేస్తున్నాడు వంశీ.