ప్రభాస్ ఓ పాన్ ఇండియా స్టార్. తన సినిమా అంటే కనీసం 300 కోట్ల బడ్జెట్ ఉండాల్సిందే. తన సినిమా అనేసరికి.. ఆ స్థాయిలోనే మార్కెట్ జరుగుతుంది. దానికి తగ్గట్టే ఖర్చు పెట్టాలి. ప్రభాస్ కోసం పాన్ ఇండియా స్టార్లని తీసుకురావాలి. ప్రతీ సినిమాలోనూ ఇదే జరుగుతోంది. కానీ మారుతి మాత్రం దీనికి రివర్స్ లో వెళ్తున్నాడు. ప్రభాస్ - మారుతి కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారన్న వార్త ముందే బయటకు వచ్చేసింది. ప్రభాస్ పక్కన ముగ్గురు హీరోయిన్లుంటే గ్లామర్ పరంగా చాలా ప్లస్ అవుతుంది. పైగా సినిమా అంతా కలర్ ఫుల్ గా తయారవుతుంది. కానీ ఆ హీరోయిన్ల పేర్లు చూస్తుంటే మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ కి మెంటలెక్కిపోతోంది.
పెళ్లి సందడి తో ఆకట్టుకున్న శ్రీలీలని ఓ హీరోయిన్ గా ఎంచుకున్నారన్నది ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. తమిళ హీరోయిన్ మాళవిక మోహనన్ ని మరో కథానాయికగా తీసుకున్నార్ట. మెహరీన్ మరో నాయిక అని తెలుస్తోంది. పెళ్లి సందడి హిట్టయినా, శ్రీలీల కొత్తమ్మాయి కిందే లెక్క. మాళవిక మోహనన్ ఇప్పటి వరకూ తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. ఇక మెహరీన్ సంగతి తెలిసిందే. తనకు స్టార్ హీరోల సరసన నటించిన అనుభవం లేదు. తనైతే ప్రభాస్ పక్కన తేలిపోతుంది. ఇండ్రస్ట్రీలో ఇంత మంది హీరోయిన్లు ఉండగా, మారుతికి వీళ్లే దొరికారా? అన్నది ప్రభాస్ ఫ్యాన్స్ ప్రశ్న. కథ, పాత్ర డిమాండ్ చేసి వీళ్లని ఎంచుకున్నాడా, లేదంటే తక్కువలో ఈ సినిమా చుట్టేద్దాం అని ప్లాన్ వేస్తున్నాడా? అనేది తేలడం లేదు. ఈ ముగ్గురూ ప్రభాస్ పక్కన సెట్టయితే.. ఈ సినిమా బజ్ పెరగడం పోయి.. తగ్గడం ప్రారంభం అవుతుందేమో అన్నది అందరి డౌటు.