పక్కా కమర్షియల్ సూపర్ ఫ్లాప్ అవ్వడంతో... మారుతి నాలుగు అడుగులు వెనక్కి వేయాల్సివచ్చింది. తను ఎంచుకొంటున్న కథలు, చేయబోతున్న హీరోల కెరీర్.... వీటిపై మరోసారి దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రభాస్ తో మారుతికి ఓ సినిమా ఓకే అయిన సంగతి తెలిసిందే. `పక్కా కమర్షియల్` ఫ్లాప్ తో ఆ ప్రాజెక్ట్ మారుతి చేతుల్లోంచి దాదాపుగా చేజారిపోయిన పరిస్థితి. సోషల్ మీడియాలో సైతం ప్రభాస్ ఫ్యాన్స్ `ఈ సినిమా చేయొద్దు డార్లింగ్` అంటూ ప్రభాస్‌కి సందేశాలు పంపారు. ఇవన్నీ చూస్తే కచ్చితంగా ప్రభాస్ తో మారుతి సినిమా ఆడిపోయినట్టే అనిపించింది.
అయితే.. మారుతిపై ప్రభాస్ నమ్మకం ఉంచాడని, ఇటీవల మారుతిని పిలిపించుకొన్న ప్రభాస్.. ఈ కథ గురించి మాట్లాడాడని, వీలైనంత త్వరగా స్క్రిప్టు సిద్ధం చేయమని మారుతికి సూచించాడని టాక్. దాంతో... మారుతి మళ్లీ ఈ స్క్రిప్టుపై కసరత్తులు మొదలెట్టేశాడని తెలుస్తోంది.
ప్రభాస్ ఏరి కోరి మారుతిని పిలిపించుకొని, కథ రెడీ చేయమనడానికి ఓ కారణం ఉంది. అదేమంటే.. ప్రభాస్ కి మూడు నెలల గ్యాప్ దొరికింది. ఈ ఖాళీని సద్వినియోగం చేసుకొని, ఓ సినిమా చేసుకుంటే కనీసం అటూ ఇటూగా రూ.80 కోట్లు వెనకేసుకోవచ్చు. మూడు నెలలకు 80 కోట్లంటే మాటలు కాదు.కాబట్టి.. ప్రభాస్ ఈ నిర్ణయం తీసుకొన్నాడని ఇండస్ట్రీ వర్గాల టాక్. కాకపోతే... ఓ సినిమాని డిజాస్టర్ చేసిన దర్శకుడ్ని ప్రభాస్ గుడ్డిగా నమ్మేయడం... ప్రభాస్ ఫ్యాన్స్‌ని కలవరపెట్టేదే.