నయనతార - విఘ్నేశ్ శివన్ ల పెళ్లి చిత్రసీమలో ఇప్పటికీ హాట్ టాపిక్కే. వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఇప్పుడు పెళ్లి చేసేసుకొన్నారు. అయినా ఈ పెళ్లికి సంబంధించిన వార్తలు ఇంకా టాక్ ఆఫ్ ది టౌన్ గానే నడుస్తున్నాయి. ఇటీవలే... వీరిద్దరూ పెళ్లి చేసుకొన్నారు. పెళ్లికి సంబంధించిన వీడియోలు, ఫొటోలూ నెట్ ఫ్లిక్స్ కి రూ.25 కోట్లకు అమ్మేశారు. దాంతో పెళ్లిని కూడా బిజినెస్ చేసుకొన్న నయన తెలివి తేటలు చూసి అంతా ఆశ్చర్యపోయారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.
నెట్ ఫ్లిక్స్ కే ఈ జంట తిరిగి పాతిక కోట్లు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది. అగ్రిమెంట్లకు ఖాతరు చేయని కారణంగా.. పాతిక కోట్లు తమ సంస్థకు చెల్లించాలని నయన, విఘ్నేశ్‌లపై కేసు వేసింది నెట్ ఫ్లిక్స్ సంస్థ.
విషయం ఏమిటంటే... నయన - విఘ్నేశ్‌ల పెళ్లికి సంబంధించిన ప్రసార హక్కులన్నీ నెట్ ఫ్లిక్స్‌కే ఇచ్చేశారు. అందుకు గానూ పాతిక కోట్లు చెల్లించే ఒప్పందం జరిగింది. అంతే కాదు... నెట్ ఫ్లిక్స్ సంస్థే ఈ పెళ్లి ఖర్చుల్ని భరించిందని సమాచారం. అయితే... నెట్ ఫ్లిక్స్ లో ఈ పెళ్లి తంతు ప్రసారం కాకుండానే.. ఆ పెళ్లి ఫొటోల్ని ఈ జంట మీడియాకు ఇచ్చేసిందని, దాని వల్ల తాము నష్టపోయామని, నిబంధనల్ని అతిక్రమించినందుకు ఈ జంట తమకు పాతిక కోట్లు చెల్లించాలని కోర్టుకెక్కింది నెట్ ఫ్లిక్స్. ఇప్పుడు వ్యవహారం కోర్టులో ఉంది.