ప్రభాస్ మారుతి కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకోబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం `రాజా డిలెక్స్` అనే పేరు కూడా పరిశీలనలో ఉంది. ఎప్పుడో సెట్స్‌పైకి వెళ్లాల్సిన సినిమా ఇది. అయితే.. అని వార్య కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. మారుతి కూడా కథని ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం చేయలేదు. ప్రభాస్ డేట్లు కూడా ఖాళీగా లేవు. అందుకే ఈ ప్రాజెక్ట్ లేట్ అవుతోంది. అయితే ఈలోగా ఈకథేమిటో బయటకు లీకైపోయింది.
ఇదో హారర్ కామెడీ సినిమా అని ముందు నుంచీ ప్రచారం జరుగుతూనే ఉంది. ఓ ఇంట్లో దెయ్యం ఉంచి.. దాని చుట్టూ కథని నడిపారు దర్శకులు. మారుతి తీసిన `ప్రేమకథా చిత్రమ్` పాయింట్ కూడా ఇదే. అయితే ఈసారి వెరైటీగా ఆ దెయ్యాన్ని థియేటర్లో ఉంచారు. తాతల నాటి ఆస్తి థియేటర్ ని అమ్మి, డబ్బులు చేసుకొందామని ప్రభాస్ ఓ ఊరు వెళ్తాడు. అయితే అప్పటికే ఆ థియేటర్ మూతబడి ఉంటుంది. అందులో ఓ దెయ్యం ఉందని టాక్. మరి.. హీరో ఆ దెయ్యాన్ని తరిమేసి, థియేటర్‌ని ఎలా స్వాధీనం చేసుకొన్నాడు? అనే కథతో ఈ సినిమా సాగుతుందట. ఆ థియేటర్ పేరు.. రాజా డీలక్స్. అదే ఈ సినిమా టైటిల్ అయిపోయింది.
థియేటర్లో దెయ్యంగా బొమన్ ఇరానీ నటించబోతున్నట్టు తెలుస్తోంది. మరి రాజా డీలక్స్ కథ ఇదేనా, లేదంటే ఇదంతా ఊహాగానాలేనా? అనే విషయాలు తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.