ప్రభాస్ తో మారుతి సినిమా అని ప్రకటించి చాలా రోజులైంది. అయితే దీనిపై ఇప్పటి వరకూ ఎలాంటి అప్ డేటూ బయటకు రాలేదు. పక్కా కమర్షియల్ ఫ్లాప్ తరవాత... ఈ కాంబోపై ప్రభాస్ అభిమానుల భయం మరింత పెరిగింది. దాంతో ఈ సినిమా ఆగిపోతే బాగుణ్ణు అంటూ మనసులోనే దండాలు పెట్టుకొంటున్నారు. ఈ ప్రాజెక్ట్ కూడా అలానే నత్తనడక సాగుతోంది. ఈ సినిమా నిర్మాత డి.వి.వి. దానయ్య ..` ఈ సినిమా చేయను` అంటూ పక్కకు వెళ్లిపోయినట్టు భోగట్టా. ఆయన ఇప్పటికే ప్రభాస్ కి రూ.50 కోట్ల అడ్వాన్స్ ఇచ్చారు. అది తిరిగి ఇచ్చేయాలి. అందుకే మారుతి ఇప్పుడు నిర్మాత కోసం వెదుకుతున్నట్టు తెలుస్తోంది.
ప్రభాస్ తో సినిమా అంటే ఏ నిర్మాత అయినా రెడీగానే ఉంటాడు. కానీ మారుతి దర్శకుడు అనేసరికి.. అంతా వెనకడుగు వేస్తున్నారు. పైగా.. ప్రభాస్ చేతిలో చాలా సినిమాలున్నాయి. ఇంత బిజీలో మారుతి సినిమాకి డేట్లు ఇస్తాడా, లేదా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అటూ ఇటూ తిరిగి ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ లాక్కెళ్లిపోతుందేమో అనిపిస్తోంది. ఎందుకంటే యూవీతో మారుతికి ఉన్న అటాచ్‌మెంట్ అలాంటిది. యూవీ బరిలోకి దిగితే ఈ ప్రాజెక్టు ఉన్నట్టు. లేదంటే.. మారుతి సినిమా పూర్తిగా ఆగిపోయినట్టు. మరి ఏం జరుగుతుందో చూడాలి.