ప్రభాస్ చేతిలో ఆదిపురుష్, ప్రాజెక్ట్ కె, సలార్ సినిమాలున్నాయి. ఇవి మూడూ సమాంతరంగా షూటింగ్ జరుపుకొన్నాయి. ఇప్పుడు ఆది పురుష్ దాదాపు పూర్తి కావొచ్చింది. త్వరలోనే ఈ సినిమా ప్రమోషన్లని మొదలెడతారు. ఇది రాముడి కథ. కాబట్టి పాన్ ఇండియా వ్యాప్తిగా ఆదరణ ఉంటుంది. నిర్మాతలు.. నార్త్ పై ఎక్కువగా దృష్టిసారించారు. తెలుగులో పబ్లిసిటీ బాధ్యత అంతా యూవీ క్రియేషన్స్ మీద వేసినట్టు తెలుస్తోంది. యూవీ కూడా `ఆదిపురుష్` తెలుగు రైట్స్ ని దక్కించుకోవాలని ఆరాటపడుతోంది. అందుకోసం రూ.100 కోట్లు వచ్చించడానికి రెడీ అయ్యింది. ప్రభాస్ అంటే యూవీ, యూవీ అంటే ప్రభాస్.కాబట్టి.. ఈ సినిమా యూవీ చేతికి వెళ్లిపోవడంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు. అయితే రూ.100 కోట్లకు అమ్ముతారా, లేదా? అనేది చూడాలి. ఈ సినిమా వంద కోట్లకు కొంటే చీప్ గా కొట్టేసినట్టే.
ఎందుకంటే తెలుగులో ప్రభాస్ మార్కెట్ అలాంటిది. ప్రభాస్ తో సినిమా తీయాలంటేనే దాదాపు రూ.200 కోట్లు అవుతోంది. అలాంటిది వందకే ప్రభాస్ సినిమా వస్తే జాక్ పాక్ కొట్టినట్టే. అయితే ఇక్కడో చిక్కు ఉంది. ఆదిపురుష్‌ని పూర్తిగా హిందీ సినిమా లెవిల్ లో తెరకెక్కించారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు అంతా బాలీవుడ్ వాళ్లే. కాబట్టి.. ఓ హిందీ సినిమాని డబ్బింగ్ లో చూస్తున్నట్టు అనిపిస్తుంది తప్ప, నేరుగా ఓ తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ రాదు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా అదే ఫీలయితే, లెక్కలు మారిపోతాయి.కాకపోతే.. రాముడి కథ, గ్రాఫిక్స్ హంగులు ఎక్కువ కాబట్టి.. వంద కోట్లని రాబట్టుకోవడం తేలికైన విషయమే.