ప్రభాస్ సినిమా అంటేనే పాన్ ఇండియా రేంజు. ఎవరైనా దాన్ని పాన్ వరల్డ్ సినిమా అని పిలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రభాస్ మార్కెట్ అలా ఉంది. ప్రభాస్ ఓ కథ ఓకే చేస్తే... తెలుగు ప్రేక్షకుల అభిరుచులనే కాదు, దేశ వ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకుకుల అభిరుచుల్ని కూడా పరిగణలోనికి తీసుకోవాలి. ప్రభాస్ చేతిలో ఉన్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే.
అయితే ప్రభాస్ మారుతి కథకి ఓకే చెప్పాడు. ఈ సినిమా కోసం మాత్రం స్ట్రాటజీ మార్చాడని టాక్. ఈ సినిమా కేవలం తెలుగు ప్రేక్షకుల కోసమే రూపొందిస్తున్నార్ట. పాన్ ఇండియా అనే ఇమేజ్ గురించి పట్టించుకోకుండా ఓ కథ తయారు చేయమని మారుతికి పురమాయించాడట ప్రభాస్. అది కూడా యాక్షన్, ఫైట్ సీక్వెన్స్‌ల గోల లేకుండా, ఫ్యామిలీ డ్రామా రాయమన్నాడట. అది పూర్తిగా అచ్చ తెలుగు సినిమా అని, అవుట్ పుట్ పై నమ్మకం వచ్చాక అప్పుడు పాన్ ఇండియా సినిమాగా విడుదల చేద్దామని ప్రభాస్ చెప్పాడట. ప్రభాస్ పారితోషికం దాదాపుగా 150 కోట్లు. అయితే ఈ సినిమాకి ప్రభాస్ వంద కోట్లు మాత్రమే తీసుకున్నాడట. నిజంగా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా వెళ్తే, అక్కడి నుంచి భారీగా సొమ్ములొస్తే.. అప్పుడు ప్రభాస్ మిగిలిన రూ.50 కోట్లు తీసుకుంటాడు. నిజంగా ఇది సరైన స్ట్రాటజీనే. పాన్ ఇండియా లెక్కలతో రాసుకున్న కథని మార్చుకోకుండా, కేవలం తెలుగు ప్రేక్షకుల్ని దృష్టిలో ఉంచుకుని కథలు తయారు చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. ప్రభాస్ ఇప్పుడు చేస్తోంది అదే.