బాహుబలి, పుష్పల పుణ్యం. టాలీవుడ్ రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది. టాలీవుడ్ హీరోలు, వాళ్ల మార్కెట్ పై ఇప్పుడు బాలీవుడ్ కూడా గట్టిగా దృష్టి పెట్టింది. టాలీవుడ్ హీరోలతో సినిమా తీస్తే.. మార్కెట్, మైలేజీ పెరుగుతాయని లెక్కలేసుకుంటోంది. కొంతమంది బాలీవుడ్ నిర్మాతలు ఇప్పుడు టాలీవుడ్ సూపర్ స్టార్లతో సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారు. అందులో భాగంగా మహేష్ బాబు త్వరలోనే ఓ పాన్ ఇండియా సినిమాపై సంతకాలు చేసే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి.
దంగల్ దర్శకుడు నితిష్‌తివారి `రామాయణం` గాథని వెండి తెరపై చూపించడానికి రెడీ అవుతున్నాడట. ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రూ.500 కోట్లతో రూపొందించాలన్నది ప్లాన్. రాముడి పాత్ర కోసం మహేష్ బాబుని సంప్రదించాడని ఇండస్ట్రీ వర్గాల టాక్. ప్రస్తుతం చిత్రబృందం మహేష్ తో సంప్రదింపులు జరుపుతోందని, మహేష్ ఓకే అంటే డీల్ పక్కా చేస్తారని తెలుస్తోంది. ఒకవేళ మహేష్ నో చెబితే.. రణబీర్ కపూర్ తో రాముడి పాత్ర చేయించడానికి సిద్ధమవుతార్ట. కాకపోతే ఫస్ట్ ఆప్షన్ మాత్రం మహేష్ బాబునే. తను కూడాచాలాకాలంగా ఓ మంచి బాలీవుడ్ ఆఫర్‌కోసం ఎదురు చూస్తున్నాడు. ఇది వరకు కూడా.. బాలీవుడ్ లో సినిమా చేసే ఛాన్స్ వచ్చినా మహేష్ పెద్దగా స్పందించలేదు. మరి ఈసారి ఏం చేస్తాడో..?