కరోనా అన్ని రంగాల్ని సంక్షోభంలో నెట్టేసింది. సినిమాల్నీ వదల్లేదు. కరోనా ప్రభావంతో... బడ్జెట్లు తగ్గించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది వరకు సినిమా వేరు, ఇప్పటి సినిమా వేరు అన్న చందాన తయారైంది. అయితే.. అన్ని సినిమాలూ ఓ లెక్క. ప్రభాస్ సినిమా మరో లెక్క కదా. ప్రభాస్ సినిమా బడ్జెట్ విషయంలో మాత్రం ఎలాంటి కోతలూ లేవట.
ప్రభాస్ - నాగ అశ్విన్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. దీపికా పదుకొణె కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కరోనాకి ముందే వచ్చేసింది. అప్పుడే ఈసినిమా బడ్జెట్ చెప్పేశారు. 250 కోట్లతో ఈసినిమాని తెరకెక్కిస్తామని ప్రకటించేశారు. అయితే కరోనా ప్రభావంతో ఈ సినిమా బడ్జెట్ తగ్గుతుందని అంతా భావించారు. బడ్జెట్ తగ్గడానికి చిత్రబృందం మార్గాలు అన్వేసిస్తోందని చెప్పుకున్నారు. కానీ.. అదేం లేదట. ఈసినిమా బడ్జెట్ కొంచెం కూడా తగ్గడం లేదని, అనుకున్న విధంగానే ఈ సినిమాపై 250 కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారని సమాచారం. ఒక వేళ బడ్జెట్ పెరిగినా.. వెనుకంజ వేయబోరట. ఎందుకంటే.. ప్రభాస్ సత్తా అలాంటిది. హిందీలో ప్రభాస్‌కి మంచి మార్కెట్ ఏర్పడింది. బాలీవుడ్ మార్కెట్ ఇచ్చిన ధీమాతోనే.. ప్రభాస్ సినిమాపై ఈ స్థాయిలో ఖర్చు పెట్టడానికి చిత్రబృందం రెడీ అయిందని తెలుస్తోంది.