ప్రభాస్ సినిమా అప్డేట్ లు రావడం లేదని నిరాశలో ఉన్న అభిమానులను సంతృప్తి పరిచేలా, సాధారణ ప్రేక్షకులను కూడా మెప్పించేలా నిన్న #ప్రభాస్20 సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ రెండూ ప్రకటించారు. అందరూ అనుకుంటున్నట్టుగానే #ప్రభాస్20 టీమ్ 'రాధే శ్యామ్' టైటిల్ ను ఖరారు చేసింది. ఈ అప్డేట్ ట్విట్టర్ లో రోజంతా ట్రెండింగ్ లో నిలవడం విశేషం. ఇదిలా ఉంటే అప్డేట్లు రావడం లేదని అభిమానుల ఈమధ్య నిరుత్సాహానికి గురవుతున్నారని గుర్తించిన ప్రభాస్ ఇకపై రెగ్యులర్ గా తన సినిమాలకు సంబంధించిన అప్డేట్లు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట.
ప్రభాస్ నెక్స్ట్ సినిమా అప్డేట్ కూడా త్వరలోనే రానుందని టాక్ వినిపిస్తోంది. 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలకమైన అప్డేట్ ఆగష్టులో రానుందని సమాచారం. అయితే టైటిల్, ఫస్ట్ లుక్ లాంటిది రిలీజ్ చేస్తారా లేక హీరోయిన్ ఎవరు లాంటి డీటెయిల్స్ మాత్రం వెల్లడిస్తారా అనేది మాత్రం తెలియాల్సి ఉంది. భారీ బడ్జెట్ తో అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమాను వైజయంతీ మూవీస్ వారు నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు జోరుగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. దాదాపు ఏడాదిన్నర సమయం తీసుకునే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అప్డేట్ ఇంత త్వరగా వస్తే గొప్ప విషయమే అనుకోవాలి.