ఈమధ్య టాలీవుడ్ లో వచ్చిన బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్స్ లో 'అల వైకుంఠపురములో' ఒకటని సంగీత ప్రియులు ఎప్పుడో తేల్చారు. దానికి తగ్గట్టే ఈ సినిమాలోని పాటలు ఒకదాన్ని మించి మరొకటి యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. సామజవరగమన, రాములో రాముల, బుట్టబొమ్మ, సిత్తరాల సిరపడు.. ఇలా అన్ని పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. అయితే బుట్టబొమ్మ యూట్యూబ్ లో ఈమధ్య సంచలనాలు సృష్టిస్తోంది. ఇప్పటి వరకూ తెలుగు పాటలలో అత్యధిక వ్యూస్ సాధించిన పాట 'ఫిదా' లోని 'వచ్చిండే'. తాజాగా ఈ పాట వ్యూస్ ను 'బుట్టబొమ్మ' దాటేసి నెంబర్ వన్ స్థానంలో నిలించింది.
'వచ్చిండే' పాటకు ఇప్పటి వరకూ 260 మిలియన్ల వ్యూస్, 633k లైక్స్ వచ్చాయి. అదే బుట్ట బొమ్మ పాటకు ప్రస్తుతం 262 మిలియన్ల వ్యూస్, 1.9 మిలియన్ లైక్స్ రావడం విశేషం. మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే 'వచ్చిండే' పాట ఈ వ్యూస్ సాధించేందుకు మూడేళ్లు పట్టగా 'బుట్టబొమ్మ' మాత్రం జస్ట్ ఐదు నెలల సమయమే పట్టింది. ఈ పాటకు థమన్ సంగీత దర్శకుడు. రామ జోగయ్య శాస్త్రి సాహిత్యం అందించగా అర్మాన్ మాలిక్ గాత్రం అందించారు. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఒక్క తెలుగు ప్రేక్షకులనే కాకుండా దేశవ్యాప్తంగా సంగీత ప్రియులను ఈ పాట అలరిస్తోంది.