బాహుబలితో పాన్ ఇండియా స్టార్... ఆ తరవాత పాన్ వరల్డ్ స్టార్ గా మారిపోయాడు ప్రభాస్. తన పారితోషికం ఇప్పుడు వంద కోట్ల పైమాటే. బాలీవుడ్ దర్శక నిర్మాతలు కూడా ప్రభాస్ తో సినిమా చేయాలని పోటీ పడుతున్నారు. అంతా బాగానే ఉంది. కానీ ఒక్క విషయంలో ప్రభాస్ తన అభిమానుల్ని పూర్తిగా నిరాశ పరుస్తున్నాడు. అదే లుక్.
బాహుబలి తరవాత ప్రభాస్ బాగా బరువు పెరిగాడు. రాధే శ్యామ్ లో ప్రభాస్ లుక్ చాలా దారుణంగా ఉందని కామెంట్లు వచ్చాయి. ప్రభాస్ ఫ్యాన్స్ సైతం ఈ లుక్ తో సంతృప్తిగా లేరు. అయితే ప్రభాస్ తన లుక్ గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పుడు మెల్లమెల్లగా.. దానిపై దృష్టి పెట్టాడు. ఇటీవల ప్రభాస్ విదేశాల్లో మోకాలి ఆపరేషన్ చేయించుకొని తిరిగొచ్చాడు. ఇప్పుడు ఫిట్ నెస్ పై దృష్టి పెట్టాడు. షూటింగులకు తాత్కాలికంగా విరామం ఇచ్చి, ప్రస్తుతం బరువు తగ్గడంపై ఫోకస్ పెట్టాడట. కనీసం 10 కిలోల బరువు తగ్గాలన్నది టార్గెట్ గా నిర్ణయించుకున్నాడని, కాస్త సన్నబడ్డాకే `సలార్`, `ప్రాజెక్ట్ కె` సినిమా షూటింగుల్లో పాలు పంచుకుంటాడని ఇన్ సైడ్ వర్గాల టాక్. మారుతి సినిమా ఇప్పటి వరకూ పట్టాలెక్కకపోవడానికి ఇదీ ఓ కారణమని తెలుస్తోంది. మొత్తానికి ప్రభాస్ తగ్గుతున్నాడు. ఇంతకంటే కావాల్సిందేముంది?