ప్రభాస్ 'సాహో' చిత్రం వచ్చి సంవత్సరం దాటింది. తర్వాత చిత్రం ఎప్పుడెప్పుడా అని ఫ్యాన్స్ వేయికళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే యంగ్ రెబెల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయిన ప్రభాస్.. ఇక ఏ సినిమా ఒప్పుకున్నా అది భారీగా ఉండాల్సిందే లేదా పాన్ ఇండియా చిత్రం అయ్యుండాల్సిందే. ఈ నేపథ్యంలోనే ప్రభాస్ పలు చిత్రాలు ఒప్పుకున్నాడు.. వాటి ఎనౌన్స్ మెంట్ కూడా జరిగిపోయాయి. వాటిలో మొదటిది రాధా కృష్ణ దర్శకత్వం లో రానున్న 'రాధే శ్యామ్'. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించబోతుంది. దీనితో పాటు వైజయంతి బ్యానర్ లో 'నాగ్ అశ్విన్' తో ఓ చిత్రం, మరియు 'తానాజీ' చిత్ర దర్శకుడు 'ఓం రౌత్' దర్శకత్వంలో 'ఆదిపురుష్' అనే చిత్రం కూడా ప్రకటించేశారు.
ఇక పోతే 2018 చివర్లో పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన 'కేజిఎఫ్', కన్నడ సినిమా స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది. ఈ చిత్రానికి 'ప్రశాంత్ నీల్' దర్శకత్వం వహించాడు. అయితే ప్రస్తుతం ఆ దర్శకుడు 'కేజిఎఫ్ 2'వ భాగం తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నాడు. ఆ తరువాత తెలుగులో ఒక చిత్రం చేస్తాడని, ఆ మేరకు పలు తెలుగు నిర్మాత నుండి భారీ అడ్వాన్స్ కూడా తీసుకున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే ప్రశాంత్ తీయబోయే తదుపరి చిత్రం ప్రభాస్ తోనే ఉండబోతుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ చిత్రం ప్రశాంత్ కన్నడలో తీసిన తొలి చిత్రం 'ఉగ్రం' కథను బేస్ చేసుకుని ఉండబోతుందట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా త్వరలో రాబోతుందని సమాచారం.